మహానటి సావిత్రి జీవితం అందరికీ తెలిసిందే. ఇది తెరిచిన పుస్తకం కూడా. ముఖ్యంగా అప్పట్లోనే.. సావిత్రి గురించిన చర్చ జోరుగా సాగేది. ముందు ప్రథమార్థంలో సావిత్రి దూసుకుపోయింది. అప్పటి వరకు లైన్‌లో ఉన్న అనేక మంది హీరోయిన్లను దాటుకుని వడివడిగా పరుగులు పెట్టిన సావిత్రి జీవితంలో జెమినీ గణేశ్ అడుగు పెట్టిన తర్వాత.. అనూహ్యంగా జీవితం మారిపోయింది.
అయితే.. వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నప్పటికీ.. ఆమె సినిమా నిర్మాణ రంగంలోకి అడుగులు వేయడం పెద్ద మైనస్‌గా అప్పట్లో చర్చ నడిచేది. అప్పటికే ఎన్టీఆర్, అక్కినేని సినిమా రంగంలోకి రావడం సినిమాలు తీయడం మొదలు పెట్టారు. ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియో నిర్మించి ఆ బ్యానర్ పేరుతో సినిమాలు తీశారు. అంతకుముందే ఆయనకు ఎన్ఏటీ ( నేషనల్ ఆర్ట్స్) బ్యానర్ ఉండేది.
అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్‌కు హీరోలుగా చేసి రెమ్యునరేషన్ తీసుకోవడం కంటే నిర్మాతగా చేస్తే ఎంత రిస్క్ ఉంటుందో త్వరలోనే తెలిసి రావడంతో జాగ్రత్తగా సినిమాలు చేసేవారు. వీరిని చూసి .. వాళ్లకు ధీకి దీటుగా తాను కూడా దూసుకుపోయేందుకు రెడీ కావడం వంటి పరిణామాల నేపథ్యంలో సావిత్రి.. కూడా నిర్మాతగా ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, ఆమెకు సినిమాల్లో నటించడం వరకు ఓకే. కానీ, చిత్ర నిర్మాణ రంగంపై అవగాహన లేదు.’
ఇదే విషయంపై ఒకసారి అన్నగారు ఆమెతో స్వయంగా ఇదే విషయం చెప్పారు. మీరు సినిమాలు తీయడం నాకు ఇష్టంలేదని అనుకుంటారేమో.. కాదు, మీరు జాగ్రత్త అని హెచ్చరించారు. ఇక, ఎవరు ఎలాంటి సలహాలు ఇచ్చినా.. ఓకే చెప్పే సావిత్రి.. దీనిని పెద్ద సీరియస్‌గా అయితే తీసుకోలేదు. కానీ, చిన్నారి పాపలు సినిమాను తానే దర్శకత్వం వహించారు. ఇందులో అందరూ మహిళలే.
అప్పట్లో ఇదొక ప్రయోగం. అయితే, ఈ సినిమా దారుణంగా విఫలమైంది. కనీసం.. పెట్టుబడి కూడా రాకపోవడంతో పాటు.. సినిమాను కొన్నవాళ్లు కోర్టుకు వెళ్లారు. దీంతోఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమె నిర్మాతగా చేసిన సినిమాలు సక్సెస్ కాలేదు. ఇలా.. సావిత్రి జీవితం అప్పటి నుంచి జారు బండగా మారిందని అంటారు.