తెలుగు సినీ వినీలాకాశంలో అన్నగారు ఎన్టీఆర్.. అక్కినేని నాగేశ్వరరావు చరిత్ర బంగారు పాళీతో రాయదగ్గది.. అన్నారు అభ్యుదయ కవి, జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత సినారే. ఈ మాట ఆయనేమీ వారిని పొగడాలని కాదు.. లేక ఊసుపోక అంతకంటే కాదు. వారిని చాలా దగ్గర గా చూసిన మహా రచయిత సి.నారాయణరెడ్డి. అనేక చిత్రాలకు వారికి పాటలు అందించారు. అనేక సినిమాల్లో కలిసి కూర్చుని.. పాటలను కంపోజ్ చేశారు.
పైగా.. చాలా దగ్గరగా కూడా మెలిగారు. అన్నగారికి ఏదైనా పనితగిలితే.. కొన్ని కొన్ని సార్లుసినారే చేసిపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు కవిగారు.. మేం మీకు పనులు చెప్పడమే.. అంటూ అన్నగారు కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యలు చేసినా.. సినారే మాత్రం ఆయన కోరకుండానే.. ఆయన మనసు తెలుసుకుని చేసిన పనులు ఉన్నాయి. ఇక, అక్కినేనితో అయితే.. సొంత సోదరుడి సంబంధం తనకు ఉందని సినారే.. పలుమార్లు చెప్పుకొన్నారు.
ఇక, వీరిద్దరి గురించి.. ఒక సందర్భంలో సినారే చెబుతూ.. పాలు నీళ్లను వేరు చేసే యంత్రాలు ఉన్నాయి. హంస నీటిని వదిలేసి పాలు మాత్రమే తాగుతుంది. కానీ, పాలు తేనెలు కలిపితే.. విడదీయడం అంత తేలికకాదు కదా! అని చమత్కరించారు. దీనికి కారణం.. కేవలం ఒకే ఒక్క అంశంలో తప్ప.. మరెప్పుడూ.. కూడా విభేదాలు పొడసూపని వైనాన్ని ఎన్టీఆర్-ఏఎన్నార్ జీవితాల్లో తాను చూశానని ఆయన చెప్పుకొన్నారు.
అప్పట్లో చెన్నై చిత్ర పరిశ్రమలో ఎన్నికలు వచ్చాయి. అక్కినేనికి రాజకీయాలకు పెద్దగా పడవు. ఆయన చాలా దూరంగా ఉంటారు. అయితే.. అతి కష్టం మీద.. కొందరు అక్కినేనిని ఒప్పించే ప్రయత్నం చేశారు. దీంతో మీ సలహా ఏంటి.. చాలా పెద్దాయనే బలవంతం చేస్తున్నారు! అని అన్నగారి సలహా అడిగారు అక్కినేని.
దీనికి అన్నగారు.. పెద్దా..చిన్నా.. పక్కన పెట్టండి.. కొన్ని కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది..! అని సలహా ఇచ్చారు. అంతే.. మళ్లీ ఈ విషయాన్ని అక్కినేని ఎప్పుడూ ప్రస్తావించలేదు.ఆయన ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేయనూలేదు. అంతేకాదు.. అనేక విషయాల్లో ఇద్దరూ కలిసిమెలిసి పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయని సినారే చెప్పుకొచ్చారు.