టాలీవుడ్‌లో ఇటీవల వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే నలుగురు సీనియర్ నటులు మృతిచెందారు. రెబల్‌స్టార్ కృష్ణంరాజు, సూపర్‌స్టార్ కృష్ణ మృతి నుంచి కోలుకోకముందే రెండు రోజుల తేడాలో మరో ఇద్దరు సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, చలపతిరావు మృతిచెందారు. ఇక నాలుగు రోజుల వ్యవధిలో మరో సీనియర్ నటుడు కూడా మనలను విడిచి వెళ్లిపోయారు. ఆయనే వల్లభనేని జనార్థన్. ఆయన ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అన్న విషయం తక్కువ మందికే తెలుసు.
ఆయన వయసు 63 సంవత్సరాలు. జనార్థన్ చౌదరి ఎవరో కాదు దివంగత దర్శకుడు విజయ బాపినీడుకు స్వయానా అల్లుడు కావడం విశేషం. ప్రముక దర్శకనిర్మాత విజయబాపినీడు మూడవ కూతురు లళినీ చౌదరిని జనార్ధన్ పెళ్లిచేసుకున్నారు. జనార్థన్‌కు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. వీరి మొదటి అమ్మాయి శ్వేత చిన్న వయస్సులోనే మృతిచెందింది. ఇక రెండో అమ్మాయి అభినయ ఫ్యాషన్ డిజైనర్..
ఇక జనార్థన్ కుమారుడు అవినాష్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. జనార్ధన్ మృతితో ఇండస్ట్రీలో విషాదచాయలు అలుముకున్నాయి. వల్లభనేని జనార్ధన్ 1959 సెప్టెంబర్ 25న ఏలూరు సమీపంలోని పోతునూరులో జన్మించారు. ఆయనకు ముందు నుంచి సినిమాల పట్ల ఆసక్తి ఎక్కువుగా ఉండేది. విజయవాడ లయోలా కాలేజ్‌లో డిగ్రీ చదువుకున్న ఆయన ఇండస్ట్రీలోకి వచ్చారు.
సొంతంగా నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి మామ్మగారి మనవలు అనే సినిమాను ప్లాన్ చేస్తే అది మధ్యలో ఆగిపోయింది. తర్వాత చంద్రమోహన్ హీరోగా తెరకెక్కిన అమాయక చక్రవర్తి సినిమాకు దర్శకత్వం వహించారు. శోభన్ బాబు హీరోగా తోడు నీడ సినిమా నిర్మించారు. ఆ తర్వాత తన కుమార్తె శ్వేత పేరు మీద శ్వేత ఇంటర్నేషన్స్ సంస్థ ఏర్పాటు చేసి శ్రీమతి కావాలి, పారిపోయిన ఖైదీలు సినిమాలు రూపొందించారు.
ఆ తర్వాత తన మామగారు విజయబాపినీడుతో కలిసి మహాజనానికి మరదలు పిల్ల సినిమా నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవితో గ్యాంగ్ లీడర్ మూవీలో సుమలత తండ్రి పాత్రలో వల్లభనేని జనార్ధన్ నటనకు ప్రశంసలు అందుకున్నారు. తెలుగులో స్టార్ హీరోలు అందరితోనూ కలిసి నటించిన ఆయన బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో కూడా నటించారు.