Moviesబాల‌య్య హిట్ సినిమాను కాపీ కొట్టి ర‌జ‌నీకాంత్ అరుణాచ‌లం సినిమా తీశారా...?

బాల‌య్య హిట్ సినిమాను కాపీ కొట్టి ర‌జ‌నీకాంత్ అరుణాచ‌లం సినిమా తీశారా…?

సినిమాలు అన్నాక ఒక సినిమాను పోలిన కథ మరో సినిమా కథను పోలి ఉండటం సహజం.
40 – 50 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమాలనే ఇప్పటి మోడ్రన్ జనరేషన్ మెచ్చేలా అటు ఇటుగా మార్చి ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా తీసి హిట్‌లు కొడుతున్న దర్శ‌కులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా ఉన్న వారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకధీరుడు రాజమౌళి హిట్ సినిమాలు కూడా గతంలో వచ్చిన కొన్ని సినిమాలను పోలి ఉంటాయన్న చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

ఇప్పుడు నడుస్తోంది అంతా సోషల్ మీడియా యుగం కావడంతో క్షణాల్లో ఏ సినిమాలో సీను ఏ పాత సినిమా నుంచి కాపీ కొట్టారు ? ఏ పాత సినిమా కథను మార్చి ఇప్పుడు సినిమాగా తీస్తున్నారు అన్నది సింపుల్ గా చెప్పేస్తున్నారు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 1997లో వచ్చిన ‘అరుణాచలం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రజినీకాంత్, సౌందర్య, రంభ కలిసి నటించిన ఈ సినిమా 1997 ఏప్రిల్ 10న రిలీజ్ అయింది. సీనియర్ హీరోయిన్ ఖుష్బూ భర్త సి సుందర్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో రజనీకాంత్ తన తల్లిదండ్రుల గురించి వివరాలు తెలుసుకుంటాడు. తన తండ్రి ఆస్తిని రెండు మార్గాల్లో తీసుకోవచ్చు అన్న విషయం తెలుస్తుంది. 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చుపెట్టి మూడు వేల కోట్ల సంపదకు వారసుడు కావడం ఒక ఛాలెంజ్..! అలాగే 30 కోట్లు తీసుకుని తన దారిన తాను వెళ్లిపోవటం రెండో ఛాలెంజ్. ముందు ర‌జ‌నీ ఈ రెండూ వ‌ద్దు త‌న‌కు త‌న త‌ల్లి మాత్ర‌మే కావాల‌ని అడుగుతాడు. అయితే అక్కడ ఉన్న ట్రస్ట్ సభ్యులు మోసగాళ్లు అని తెలిసి 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చుపెట్టే సవాల్ కు రజనీకాంత్ ఒప్పుకుంటాడు.

అరుణాచలం ఆ డబ్బును రకరకాలుగా విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటాడు. దానిని అడ్డుకునేందుకు ట్రస్ట్ సభ్యులు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని అరుణాచలం ఈ పరీక్షలో నెగ్గి మోసగాళ్లు అయిన ట్రస్ట్ సభ్యులకు బుద్ధి చెబుతాడు. ఇది ఈ సినిమా కథ అయితే ఈ సినిమా తెరకెక్కడానికి 22 సంవత్సరాల క్రితమే నటసింహం బాలకృష్ణ హీరోగా ఇదే కథతో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు ‘బాబాయ్ అబ్బాయి ‘ .జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కృష్ణవేణి పాత్రలో అనితారెడ్డి హీరోయిన్‌గా నటించింది.

బాబాయ్ – అబ్బాయ్ క‌లిసి సుత్తివేలుపై వేసే ఎత్తులు… పై ఎత్తులతో నడుస్తుంది. సంపాదించడం ఎలాగో తెలియని బాల‌య్య‌కు సుత్తివేలు 25 లక్షల రూపాయలు ఇస్తాడు. దానం చేయకుండా, ధ్వంసం చేయకుండా, పారేయకుండా ఆ డబ్బును 30 రోజుల్లో గా ఖర్చు చేయాలని ఆదేశిస్తాడు. ఈ డబ్బును ‘బాబాయ్ అబ్బాయి ఇద్దరు విచ్చలవిడిగా ఖర్చు చేయడం ప్రారంభిస్తారు. విచిత్రం ఏంటంటే వీరు ఎంత ఖర్చు పెడుతుంటే… ఆ సంపద అంతకంతకు అనూహ్యంగా పెరుగుతూ పోతూ ఉంటుంది. దీంతో ‘బాబాయ్ అబ్బాయి’ ఇద్దరు పందెంలో ఎలా ? గెలవాలా అని సంకట స్థితిలో పడిపోతారు.

ఎంత వద్దనుకున్నా ఎంత ఖర్చు పెడుతున్నా అదనంగా డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇలా కథ అనేక మలుపులు తిరుగుతుంది. ఇలా డబ్బును ఖర్చు చేయడంలో అబ్బాయి ఫైయిల్ అయినా కూడా వరప్రసాద్ రావు అతడి నిజాయితీకి మెచ్చి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయడంతో కథ ముగుస్తుంది. ఇదే కథను రెండు దశాబ్దాల తర్వాత సి.సుందర్ అప్పటి జనరేషన్ కు అనుగుణంగా మార్చి రజినీకాంత్ తో ‘అరుణాచలం’ సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అలా ఈ రెండు కథల మధ్య పోలిక ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news