కొన్ని కొన్ని సినిమాల్లో ఎన్టీఆర్-సావిత్రిల కాంబినేషన్ మైలు రాయిగా నిలిచిపోయిన సందర్భాలు ఉన్నా యి. అయితే.. సావిత్రి.. ఫుల్ బిజీగా ఉండడం.. తమిళ సినిమాల్లోనూ ఆమె నటించడం.. ప్రారంభించిన తర్వాత తెలుగు సినిమాల్లో ఒకటి రెండు వదులు కోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇలా.. వచ్చిన సినిమాల్లో తిరుపతమ్మకథ ఒకటి. ఈ సినిమాను అసలు సావిత్రిని దృష్టిలో పెట్టుకుని రెడీ చేసుకున్నదే.
ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరో. ఇక హీరోయిన్‌గా దర్శక నిర్మాతలు సావిత్రిని ఫిక్స్ చేశారు. కానీ, అప్పటికే సావిత్రి కాల్షీట్లు ఖాళీగా లేకపోవడంతో కృష్ణకుమారికి అవకాశం ఇచ్చారు. నిజానికి అన్నగారు సైతం.. ఈ సినిమాలో సావిత్రికోసం ప్రయత్నం చేశారు. అయితే, ఆమె కాల్షీట్లు ఖాళీగా లేవన్న విషయం ఆయనకు తెలియదు.
దీనికితోడు మీరు చెబితే.. సావిత్రమ్మ ఒప్పుకొంటుందని నిర్మాతలు ఒత్తిడి చేయడంతో అలా అయితే, ఆమెనే హీరోయిన్‌గా పెట్టండి.. నేను ఒప్పిస్తాను.. అని అన్నగారు మాటిచ్చారు. ఎన్టీఆర్ ఎంతో రిక్వెస్ట్ చేశారు. కానీ, సావిత్రి నుంచి నో ఆన్సర్ రావడం అప్పటికప్పుడు.. అన్నగారు కృష్ణకుమారి అయితే.. నష్టమేంటి? అని ప్రశ్నించి మరీ ఆమెను ఒప్పించారని సిని వర్గాలు చెబుతాయి.
అప్పట్లో కృష్ణకుమారికి ఒక లక్షణం ఉండేది. తనను దృష్టిలో పెట్టుకుని రాసిన కథలను మాత్రమే ఆమె నటించారు తప్పితే.. మిగిలినవి కాదు. ఎవరోకోసం.. చేసిన వంట నేను ఎలా తింటాను.. అనేవారట. అయితే, అన్నగారు మాత్రం ఆమెను ఒప్పించి.. ఈ సినిమాలో నటించేలా చేశారు. ఈ సినిమా కూడా ఊహించని విధంగా రికార్డు సృష్టించింది. సావిత్రి నో చెప్పడంతో ఎన్టీఆర్ పట్టుబట్టి కృష్ణకుమారిని ఒప్పించాక కొద్ది రోజులు ఎన్టీఆర్ – సావిత్రి మధ్య మాటలు లేవని అంటారు.