తెలుగు సినీ వినీలాకాశంలో అక్కినేని, ఎన్టీఆర్‌లు ధ్రువతారలు. ఈ సినీ జగత్తు ఉన్నంత వరకు వారు మిలమిల మెరుస్తూనే ఉంటారు. ఏదో ఒక రూపంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటారు. తెలుగు సినిమా ఉన్నంత కాలం ఎన్టీఆర్, ఏఎన్నార్ చరిత్ర నడుస్తూనే ఉంటుంది. భవిష్యత్తులోనూ కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీపై చెక్కు చెదరని ముద్ర వేసుకునేంత గొప్ప పేరు తెచ్చుకున్నారు వీరిద్దరు. అయితే.. వీరికి సినీ రంగంలో ఎలా మెలగాలి? ఎవరితో ఎలా ఉండాలి? అనేది కొత్తలో తెలిసేది కాదు.
ఒకరకంగా చెప్పాలంటే.. కొన్ని కొన్ని పాత్రల్లో నటించి చేతులు కాల్చుకున్న పరిస్థితి కూడా ఉంది. కెరీర్ ఆరంభంలో ఇద్దరికి ఎదురు దెబ్బలు తప్పలేదు. ఎవరితో ఎలా ? నడుచుకోవాలి ? ఏయే సినిమాలు చేయాలన్నదానిపై కాస్త కన్‌ఫ్యూజన్ ఉండేదట. అయితే.. ఇలా వెండితెరకు పరిచయమైన కొత్తల్లో వారికి ఒక అగ్రహీరో సాంగత్యం లభించింది. ఆయన అనేక పాఠాలు చెప్పేవారట.
ఆయనే అప్పటి హీరో.. చిత్తూరు వీ నాగయ్య. నమ్మలేక పోయినా..నిజం. ఆయన అనేక మందిని తీర్చిదిద్దారు. వారిలో అక్కినేని, ఎన్టీఆర్ అంటే నాగయ్యకు వల్లమాలిన అభిమానం. ఆయనను వీరు నాన్నగారు అని ప్రేమతో పిలిచేవారట. ఈ సాంగత్యంతోనే.. సినిమాల్లో ఎవరిని నమ్మాలి.. ఎలా వ్యవహరించాలో చెప్పారని అంటారు. “రెమ్యున రేషన్ తీసుకోవాలి. కానీ, నిర్మాత కూడా బాగుండాలని సలహాలు ఇచ్చేవారట.
నిర్మాత బాగుంటే.. మరో పిక్చర్‌కు అవకాశం దక్కు తుంది. నష్టాలు వస్తే కలిసి పంచుకోండి. లాభాలు వచ్చినప్పుడు వాటాలు అడగకండి. మొహమాటానికి పోయి.. వారు ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. దానివల్ల సినిమా రంగం అభివృద్ధి చెందదు“ అని చేసిన సూచనను ఎన్టీఆర్, అక్కినేనిలు చాలా కాలం పాటు అనుసరించారు.
అంతేకాదు.. రూపాయి రాగానే .. ఎలా వ్యవహరించాలో కూడా చెప్పారట. దుర్వ్యసనాల జోలికి పోవద్దని పదే పదే చెప్పారని.. ఆయనను అనుసరించిన చాలా మంది నటులు బాగుపడితే.. కొందరు మాత్రం చెడుదారిపట్టారని గుమ్మడి రాసుకున్న పుస్తకంలో ప్రస్తావించారు. మనీ మేనేజ్ మెంట్ కంటే.. కూడా మైండ్ మేనేజ్ మెంట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని నాగయ్య చెప్పినట్టు గుమ్మడి పేర్కొన్నారు.