ఇప్పుడు అంతా మల్టీఫ్లెక్స్‌ల మయం అయిపోతోంది. ఎక్కడికక్కడ సింగిల్ స్క్రీన్లు మాయం అయిపోతున్నాయి. లేకపోతే సింగిల్ స్క్రీన్లలో సినిమాలు చూడాలంటే రెన్నోవేట్ చేసిన థియేటర్లు మాత్రమే అయిఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా థియేటర్లలో ఉన్న సౌకర్యాలు బాగా చూస్తున్నారు. సౌండ్ సిస్టమ్, పిక్చర్ క్లారిటీ, సరైన విజువల్స్ ఉండాల్సిందే. ఇలాంటి థియేటర్లనే ఎంచుకుని సినిమాలు చూస్తున్నారు.
అయితే గ్రామీణ ప్రాంతాలతో పాటు మండల కేంద్రాల్లో ఇలాంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్న థియేటర్లు దొరకవు. ఇక్కడ కూడా అలాంటి అందమైన అనుభూతి అస్వాదిస్తూ సినిమా చూసేలా సరికొత్త థియేటర్లు పుట్టుకు వస్తున్నాయి. చిన్న చిన్న ప్రాంతాల్లో కోట్లు ఖర్చు పెట్టి థియేటర్లు కట్టి మెయింటైన్ చేయడం అంటే ఎవరికి అయినా వాచిపోద్ది. అందుకే గ్రామీణ ప్రాంతాల్లోనూ మల్టీఫ్లెక్స్ తరహా అనుభూతి ఇస్తూ, థియేటర్ల యాజమాన్యాలకు కూడా నష్టం రాకుండా ఉండేలా ఇగ్లూ థియేటర్లు వస్తున్నాయి.
ఏపీ, తెలంగాణలో ఇప్పటికే ఈ థియేటర్లు కొన్ని చోట్ల ప్రారంభమయ్యాయి. ఇగ్లూ అంటే మంచు ప్రాంతంలో ఎస్కిమోలు ఏర్పాటు చేసుకునే ఇళ్లు. ఇవి అరెకరంలో ఏర్పాటు చేస్తారు. తాజాగా ఉత్తర తెలంగాణలోని రాజారాం పల్లిలో ఈ ఇగ్లూ థియేటర్ ఏర్పాటు చేశారు. 100 సీట్ల కెపాసిటీతో పాటు ఆడిటోరియం కూడా ఉంటుంది. ఇందులోనే క్యాంటిన్, వాష్ రూమ్స్, టికెట్ కౌంటర్లు కూడా ఉంటాయి. థియేటర్ చిన్నగా ఉన్నా స్క్రీన్ మాత్రం పెద్దగానే ఉంటుంది.
స్క్రీన్ పెద్దగా ఉండడంతో 70 ఎంఎం ఫీలింగ్, ఏసీ, సిట్టింగ్ అన్ని కూడా మల్టీఫ్లెక్స్ రేంజ్‌లోనే ఉంటాయి. ఇప్పటికే అనంతపురంలో ఒకటి, ఖమ్మం జిల్లా కల్లూరులో మరొకటి ఇలాంటి థియేటర్లు ఏర్పాటు అయ్యాయి. మహారాష్ట్రకు చెందిన ‘ఛోటా మహారాజ్’ సంస్థ చిన్న టౌన్లు, గ్రామాల కోసం ఇలాంటి థియేటర్లు ప్రత్యేకంగా నిర్మిస్తోంది. మహా అయితే రు. 10 లక్షల లోపు పెట్టుబడితో ఈ సినిమా థియేటర్లు పూర్తయిపోతున్నాయి.
ఔత్సాహికులు అయిన కొందరు ముగ్గురు లేదా నలుగురు కలిసి ఇలాంటి థియేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆ మహారాజా సంస్థ నుంచి ఫ్రాంఛైజీ తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో ఈ థియేటర్లు ఏర్పాటు చేస్తోంది. ఇవి సక్సెస్ అయితే ఇకపై ఏపీ, తెలంగాణలోని చిన్న పల్లెటూర్లలో కూడా మల్టీఫ్లెక్స్‌లు వచ్చేస్తాయి.