ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్టు అన్న చందంగా ఉంది బాలయ్య వీర సింహారెడ్డి – చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాల పరిస్థితి. ఈ రెండు సినిమాలను టాలీవుడ్ లోనే అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీస్ నిర్మిస్తోంది. పైగా ఇద్దరు స్టార్ హీరోలు.. రెండు భారీ బడ్జెట్ సినిమాలు సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. మామూలుగా డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు ఏ దిల్ రాజుకో ? లేదా ఏ ఆసియన్ సునీల్ కు ఇచ్చేసి ఉంటే ఇంత కాంట్రవర్సీ అయ్యేదే కాదు. ఈ రెండు సినిమాలతో మైత్రి మూవీ సంస్థ నైజాంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ప్రారంభిస్తుంది. ఇది ఖచ్చితంగా దిల్ రాజు – ఆసియన్ సునీల్ కు పోటీ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.
సీడెడ్ శశితో కలిసి నైజాంలో మైత్రీ వాళ్లు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెడుతున్నారు. ఇక దిల్ రాజు – శిరీష్, సునీల్ కలిసి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లను ఏకతాటిమీదకు తీసుకువచ్చి మైత్రీ వాళ్ల మీదకు దండయాత్రకు రెడీ అవుతున్నారన్న చర్చలు అయితే ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు బాలయ్య వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలకు ఇబ్బందిగా మారుతోంది.
ఒక్కసారి వెనక్కు వెళితే పుష్ప , సర్కారువారి పాట సినిమాలు థియేటర్లలో ఉండగానే ఓటీటీలకు ఇచ్చేశారని నైజాం ఎగ్జిబిటర్లు గుర్రుగా ఉన్నారు. అందుకే ఇప్పుడు పై రెండు సినిమాలకు థియేటర్లు ఇచ్చేవాళ్లంతా ఓ ప్రెస్‌మీట్ పెట్టి మరీ మైత్రీ వాళ్ల ముందు తమ డిమాండ్లు ఏకరువు పెట్టాలని చూస్తున్నారట. దీని వెనకే శిరీష్, సునీల్ ఉన్నారన్న ప్రచారం అయితే నడుస్తోంది.
ఓటీటీ పలాన టైం వరకు ఇవ్వమని ఖరాఖండీగా ముందు చెప్పేవరకు ఈ రెండు సినిమాలు తాము థియేటర్లలో వేయం అన్న డిమాండ్లు పెడతారని అంటున్నారు. అంటే పుష్ప, సర్కారు వారి పాట సినిమాల ఓటీటీ రిలీజ్ సాకుగా చూపించి ఇప్పుడు బాలయ్య, చిరు సినిమాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు అయితే మొదలయ్యాయనే అనుకోవాలి. మరి దీనికి మైత్రీ వాళ్ల నుంచి ఎలాంటి రిటాక్ట్ ఉంటుందో ? చూడాలి.