విందు భోజనం అంటే.. అన్నగారు ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టం. నిజానికి ఆయన సినీరంగంలో ఉన్న కొత్తలో కొన్ని ఇబ్బందులు పడ్డారు కానీ, తర్వాత రాజధిరాజులాగా ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నిత్యం విందు భోజనాలే చేసేవారు. అయితే.. కొందరు దర్శకులు బీఎన్ రెడ్డి, కేవీ రెడ్డి వంటివారు మాత్రం “షూటింగ్ సమయాల్లో విందు భోజనాలేంటి.. డైలాగులు సరిగా పలకలేరు“ అని కసురుకునేవారట. వారికి ఉన్న చనువు అలాంటిది. అయితే.. వీరి దగ్గర కూడా.. మాట వినని మొండి ఘటం.. ఎస్వీ రంగారావు.
రంగారావుకు అలాంటి యాక్సస్ ఉండేది. రంగారావు షూటింగులకు వస్తున్నారంటే.. మధ్యాహ్నం.. చెన్నైలోని పళని హోటల్ నుంచి విందు భోజనం వచ్చేది. షడ్రశోపేతమైన పదార్థాలు అందులో ఉండేవి. మరీ ముఖ్యంగా రంగారావుకు ఎంతో ఇష్టమైన.. పప్పుచారు – ఉప్పు చేప కాంబినేషన్ ఖచ్చితం..! దీంతో రంగారావు మధ్యాహ్న భోజనం అంటే.. విందు పసందుగా ఉండడమే కాదు.. షూటింగ్ లొకేషన్ మొత్తం.. ఘుమఘుమలాడిపోయేది.
అయితే.. కొన్నాళ్లకు .. అన్నగారితో ఉన్న యాక్సస్‌తో తన విందులో ఎన్టీఆర్‌ను కూడా భాగం చేశారురంగారావు. ఇక, అక్కడి నుంచి అన్నగారు – రంగారావు నటించే సినిమా అంటే.. చాలు, విందు పసందు అన్నట్టుగా ఉండేదట. వీళ్ల తిండి చూసిన సినీ జనాలు ఇదేం తిండిరా బాబు అనుకునేవారట.
ఇక, అప్పట్లో క్యామెడీ నటుడు అంజి, పద్మనాభంలు వీరితో కలిసి విందు చేసినా.. ఆచార వ్యవహారాలు అడ్డు వచ్చేవి. దీంతో మీ విందుకు వస్తాం కానీ.. మాకు పప్పు, ఆవకాయ ఉంటే చాలు అని కొటేషన్ ఇచ్చేవారట.
దీంతో రంగారావు గారు.. ప్రత్యేకంగా వీరి కోసం.. పప్పు ఆవకాయలను ఇంటి నుంచి తెప్పించిన సందర్భాలు ఉన్నాయని.. గుమ్మడి రాసుకున్న పుస్తకంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అంతేకాదు.. ఇప్పటి మాదిరిగా డైట్ అంటూ.. ఓ గ్లాసు జ్యూసు, రెండు కీరా ముక్కలతో సరిపెట్టుకునే ఘటాలు కావని.. ముద్ద కలిపారంటే.. చేతికి నెయ్యి జిడ్డు అంటుకోవాల్సిందేనని ప్రేమగా రాసుకున్నారు.