అన్నగారు ఎన్టీఆర్ సినీ రంగంలో అనేక పాత్రలు ధరించారు. అనేక సినిమాలు చేశారు. అంతేకాదు.. ఆయన దర్శకత్వంలో అనేక సినిమాలు కూడా వచ్చాయి. అయితే.. ఎప్పటికప్పుడు వినూత్నను కోరుకునే ఎన్టీఆర్ కొత్తవారికి అవకాశాలు కూడా ఎక్కువగానే ఇచ్చారు. ఇలా ఆయన దర్శకత్వంలో వచ్చిన సీతారామకళ్యాణం.. పూర్తి రామాయణ కథ ఆధారంగా నిర్మించారు.
ఈ సినిమాలో నందీశ్వరుడి పాత్రకు ప్రాధాన్యం ఎంతో ఉంది. రావణాసురుడి జీవితాన్ని ఒక కీలకమలుపు తిప్పిన పాత్ర అది. తల్లి కోరిక మేరకు శివుడి ఆత్మలింగాన్ని తీసుకురావాలనే కాంక్షతో రావణాసురుడు కైలాసానికి వెళ్తాడు. ఈ సమయంలో శివపార్వతులు నాట్య కేళిలో తన్మయత్వంతో ఉంటారు. దీంతో నందీశ్వరుడు.. రావణుడిని అడ్డిగించడం.. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం ఆసక్తిగా ఉంటుంది.
ఈ సమయంలోనే రావణుడు.. నోరు పారేసుకుని.. కోతి మాదిరిగా.. నన్ను అడ్డగిస్తున్నావంటూ నందీశ్వ రునిపై విరుచుకుపడతాడు. ఈ సమయంలో కోపగించిన నందీశ్వరుడు ఏ కోతులనైతే చులకనగా భావించావో .. అవేకోతులు నీ మరణానికి దోహదపడతాయంటూ శాపం ఇస్తారు. ఈ పాత్ర నిడివిచిన్నదే అయినా.. పాత్ర కు ఎంతో ప్రాధన్యం ఉంది. దీంతో ఈ పాత్రను అప్పటికే ప్రముఖ నేపథ్య గాయకులుగా ఉన్న ఘంటసాల వెంకటేశ్వరరావుకు ఇవ్వాలని ఎన్టీఆర్ తలపోశారు.
ఇదే విషయాన్ని ఆయనకు చెప్పారు. వాస్తవానికి అప్పటికే చాలా మంది దర్శకులు ఘంటసాలను తెరపై కనిపించమని కోరారు. “తెరవెనుక మీ గాత్రం వినిపించడమే కాదు..తెరమీద మీరు కనిపిస్తే.. ప్రేక్షకులు ఇష్టపడతారు“ అనే అనేక మంది ఆయనకు సూచించారు. అయితే, ఆయన మాత్రం సున్నితంగా తిరస్కరించారు. ఇక, అన్నగారు అడిగినా.. ఆయన ఇదే చెప్పారు.
తను నటించడం ప్రారంభిస్తే.. మరొకరికి అవకాశం లేకుండా పోతుంది.. ఇప్పుడు ఉన్న గాత్ర ఆదాయం చాలునని ఆయన ఎంతో సున్నితంగా తిరస్కరించారు. ఈ విషయాలు ఎందుకు మననం చేసుకుంటున్నామంటే రీసెంట్‌గా ఈ నెలలోనే 4వ తేదీ ఘంటసాల శత జయంతి జరిగింది. ఆ మహనీయుడి స్మరణలో కొన్నయినా.. తెలుసుకునే ప్రయత్నం.