సినిమా రంగం.. అంటే ఇప్పుడున్న విధంగా బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఉండేది కాదు. అప్పట్లో ఒక హీరోయి న్ తెరమీద కనిపించాలంటే.. అనేక పారామీటర్లు ఉండాల్సి వచ్చేది. ఇప్పుడంటే.. రెండు డాన్సుల్లో కని పించి.. నాలుగు సీన్లలో కనిపిస్తున్నారు. స్కిన్ షోకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ, అప్పటి రోజుల్లో కళ్ల నుంచి అభినయం వరకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేవారు.
అదేవిధంగా నృత్యం, డైలాగ్ డెలివరీకి కూడా ప్రాధాన్యం ఉండేది. ముఖ్యంగా అప్పట్లో డబ్బింగ్ ఆర్టిస్టులు అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండేవారు కాదు. ఎవరి వాయిస్ వారే చెప్పుకోవాల్సి వచ్చేది. ఇలా అన్ని రంగాల్లోనూ పట్టు పెంచుకుని సినిమాల్లో నిలదొక్కుకోవడం అంటే మాటలు కాదు. అప్పట్లో సుసర్ల దక్షిణామూర్తి దగ్గర హీరోయిన్లు చాలా మంది సంగీత పాఠాలు నేర్చుకునేవారట. ఇలా సినీరంగంలోకి అడుగు పెట్టిన షావుకారు జానకి.. హీరోయిన్‌గా అనేక ఆశలు పెట్టుకున్నారు.
అయితే, ఆమె ఒక్క షావుకారు సినిమా తర్వాత.. హీరోయిన్‌గా పెద్దగా రాణించలేక పోయారు. దీనికి కారణం.. ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే సరిపోతుందనే ముద్ర పడిపోవడమే. అయితే, అన్నగారు తన సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు ఇప్పించే ప్రయత్నం చేసినా.. నిర్మాతలు, అప్పటి దర్శకులు మాత్రం అడ్డు చెప్పారట. దీంతో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా నే మిగిలిపోయారు. అయినా కూడా వెండితెరపై తననటనతో తిరుగులేని నటిగా పేరు తెచ్చుకున్నారు.