అలాంటి నటుడు లేరు.. రారు.. అని తరచుగా అంటూ ఉంటారు. ఇది నిజం కూడా. ఒకప్పుడు ఎస్వీ రంగా రావు అంటే.. ప్రతినాయక పాత్రలకు పెట్టింది పేరు. ఇక, ఆయన తప్ప ఎవరూ చేయలేరన్న పాత్రలు కూడా ఉన్నారు. ఉదాహరణకు నర్తనశాలలో కీచకుడి పాత్రఅంటే.. వెంటనే ఎస్వీనే గుర్తుకు వస్తారు. ఇక, రాముడు, కృష్ణుడు అంటే అన్నగారే గుర్తుకు వస్తారు. ప్రేమకు సంబంధించిన విషయాలకు వస్తే.. అక్కినేనిని మించిన నటుడు లేరనే అంటారు.
అయితే.. వారంతా వెళ్లిపోయినా.. వెండి తెరకు దూరమైనా తర్వాత తర్వాత.. వేరేవారినైనా పెట్టి ఆయా పాత్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతేతప్ప.. అలాంటి నటుడిని మరిపించేలా నటించే వారు లేరంటూ.. సినిమాలను ఆపేసిన సందర్భాలు కనిపించవు. ఎవరితోనో ఒకరితోనే ఆయా క్యారెక్టర్లు వేయించిన సందర్భాలు ఉన్నాయి. కానీ,తెలుగు తెరపై ఇలాంటి సందర్భం కూడా చోటు చేసుకుంది. ఆమెలా! నటించేవారు.. ప్రేక్షకులను మెప్పించేవారు లేరని పేర్కొంటూ సినిమాను రద్దు చేసుకున్న ఘటన ఉంది.
అదే `గుండమ్మ కథ`. ఓల్డ్ మూవీ అయిన గుండమ్మ కథ 1962లో విడుదలైంది. నిజానికి ఈ సినిమాను ఆంగ్ల మహా రచయిత విలియం షేక్‌స్పియర్ రాసిన `ది టేమింగ్ ఆఫ్ ష్రూ` కథ ఆధారంగా తీశారు. ఆదిలో ఈ సినిమా కేవలం టైం పాస్ కోసం తీసినట్టు దర్శకుడు కమలాకర కామేశ్వరరావు చెప్పేవారట. కానీ, ఇది సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఇందులో సూర్యాకాంతం నటనకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. ఈ సినిమా తర్వాత తమిళం, హిందీల్లోకి కూడా తీశారు. ఇందులో ప్రధాన పాత్రలు.. అన్నగారు ఎన్టీఆర్, అక్కినేని నటించారు.
కట్ చేస్తే.. ఇదే సినిమాను మళ్లీ తీయాలని అన్నగారు ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ, అక్కినేని వారసుడు నాగార్జున భావించారు. దీంతో ఇద్దరూ కలిసి ప్రాజెక్టును తెరమీదకి తీసుకురావాలని.. కథలో ఎలాంటి మార్పులూ ఉండవు. డైలాగులు కూడా మారవు. కానీ, పాటలు మాత్రమే మారతాయి. ఇక, నటుల విషయం కూడా అంతే. ఎస్వీ రంగారావు పాత్రకు గుమ్మడిని బుక్ చేసుకున్నారు. పాత్రలన్నీ అయిపోయాయి. కానీ, ఒకే ఒక్క పాత్ర మిగిలిపోయింది. అదే సూర్యాకాంతం.
గుండమ్మ కథ ఓల్డ్‌సినిమాలో.. సూర్యాకాంతం పాత్రను అదే తరహాలో పోషించి మెప్పించేవారి కోసం.. బాలయ్య.. ఎంతో మందికి స్క్రీన్ టెస్ట్ చేయించారట. అయితే.. ఏ ఒక్కరూ సూర్యాకాంతం మాదిరిగా చేసేలా కనిపించకపోవడం, ఆ సినిమాకు ఆ పాత్రే కీలకం కావడంతో అటు నాగార్జున, ఇటు బాలయ్య ఇద్దరు కూడా ప్రాజెక్టును విరమించుకున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది! కానీ ఇది నిజం!!