టాలీవుడ్ లో వచ్చే సంక్రాంతికి మూడు పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి. టాలీవుడ్ లో సీనియర్ హీరోలుగా ఉన్న నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలతో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న వారసుడు సినిమా కూడా సంక్రాంతికి వస్తోంది. అలాగే మరో తమిళ్ హీరో అజిత్ తునివు సినిమా కూడా రిలీజ్ కానుంది. విజయ్ వారసుడు సినిమాకు నిర్మాత టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కావడంతో ఏపీ, తెలంగాణలోని మంచి థియేటర్‌లు అన్ని వారసుడు సినిమాకు బ్లాక్ చేస్తున్నారు.
మరోవైపు బాలయ్య, చిరంజీవి సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా ఆ సినిమాల కన్నా వారసుడికే ఎక్కువ థియేటర్‌లు వచ్చేలా దిల్ రాజు చక్రం తిప్పుతున్నారన్న చర్చలు టాలీవుడ్ లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వినిపించడం కాదు.. వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే మంచి థియేటర్లు, ఎక్కువ థియేటర్లు వారసుడికే వెళ్లిపోతున్నాయి. మిగిలిన థియేటర్లను పంచుకునేందుకు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు అష్ట కష్టాలు పడాల్సి వస్తోంది.
ఇక ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల్లో కలిపి దిల్ రాజుకు దాదాపు 90కు పైగా థియేటర్‌లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ దిల్ రాజు వారసుడు సినిమాకు తెలుగు భాష సెగ గట్టిగా తగులుతోంది. ఉత్తరాంధ్రలో అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు. ఇక్కడ వాళ్లకు హిందీ, తమిళ డబ్బింగ్ సినిమాలు పెద్దగా పట్టవు. ఎంతో హిట్ టాక్ వచ్చినా వైజాగ్ సిటీ వదిలేస్తే మిగిలిన చోట్ల ఈ డబ్బింగ్ సినిమాలు చూడరు. వాళ్ళు సంక్రాంతి సీజన్ లో తెలుగు హీరోల సినిమాలు మాత్రమే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు దిల్ రాజు అక్కడ కూడా వారసుడు సినిమాను ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
బాలయ్య, చిరంజీవి సినిమాలను కాదని విజయ్ వారసుడు సినిమాను థియేటర్లలో వేస్తే తాము ఊరుకోమని ఇప్పటికే దిల్ రాజుకు అక్కడ థియేటర్ల యజమాన్యం అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వాళ్లంతా తెలుగు ఛాంబర్ రిలీజ్ చేసిన లేఖను కూడా చూపిస్తున్నారట. సంక్రాంతి సీజన్ లో ముందుగా తెలుగు హీరోల సినిమాలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని.. ఆ తర్వాత మాత్రమే వారసుడు సినిమాను ప్రదర్శించాలని చెబుతున్నారట. కాసుల కురిపించే బాలయ్య, చిరంజీవి సినిమాలు కాదని విజయ్ వారసుడు సినిమా వేస్తే తమకు గిట్టుబాటు కాదని చాలామంది ఎగ్జిబిటర్లు కూడా వాపోతున్నారు.
సినిమా మాత్రమే కాకుండా పార్కింగ్, ఫుడ్ బిజినెస్ కూడా వారసుడు సినిమాకు ఉండదని కచ్చితంగా తమ థియేటర్లు కళకళలాడాలి.. పండగ బాగా జరగాలి అంటే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు మాత్రమే ప్రదర్శించాలని ఉత్తరాంధ్ర ఎగ్జిబిటర్ల సంఘం ఇప్పటికే తీర్మానం చేసినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పటికే ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న దిల్ రాజుకు ఇది పెద్ద షాకే అని చెప్పాలి.