టాలీవుడ్‌లో సంక్రాంతి వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ దగ్గర సినిమాల యుద్ధం మామూలుగా ఉండదు. అందులోనూ బాలయ్య, చిరంజీవి సినిమాలు పోటీ పడుతున్నాయంటే అసలు ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ముందే మాటల తూటాలు పేలుతుంటాయ్. ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఎవ్వరూ ఏం కామెంట్ పెట్టినా అందరికి తెలిసిపోతోంది. 20 ఏళ్ల క్రితం ఇవేం లేదు. బయట పల్లెటూర్లలో చూసినా ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య మా హీరో సినిమా హిట్.. మా హీరో సినిమా ఎక్కువ రోజులు ఆడుతుందని ఒక్కటే చర్చలు జరిగేవి.
2001లో టాలీవుడ్‌లో సంక్రాంతికి పెద్ద యుద్ధం జరిగింది. ఏకంగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి పోటీ పడ్డాయి. జనవరి 11న బాలయ్య నరసింహానాయుడు, చిరంజీవి మృగరాజు, 14న వెంకటేష్ దేవీపుత్రుడు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ మూడు సినిమాల్లో చిరంజీవి మృగరాజు డిజాస్టర్. దేవీపుత్రుడు సినిమా యావరేజ్ అయినా భారీ బడ్జెట్ వల్ల కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు.
బాలయ్య నరసింహానాయుడు బ్లాక్‌బస్టర్. పైగా 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడడంతో పాటు భారతదేశ సినీ చరిత్రలో ఫస్ట్ టైం 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. అయితే ఈ మూడు సినిమాలు రిలీజ్ అయినప్పుడు హైదరాబాద్‌లో బాలయ్య నరసింహానాయుడుకు థియేటర్ల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందట. అప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల కేవలం 14 థియేటర్లు మాత్రమే ఇచ్చారట.
మిగిలిన మెజార్టీ థియేటర్లు అన్నీ కూడా చిరంజీవి మృగరాజు సినిమాకే వెళ్లిపోయాయట. ఇక కొన్ని థియేటర్లు వెంకటేష్ దేవీపుత్రుడు సినిమాకు ఇచ్చారు. రిలీజ్‌కు ముందు బాలయ్య ఫ్యాన్స్ చాలా బాధపడ్డారట. అయితే రిలీజ్ అయ్యాక దేవీపుత్రుడు, మృగరాజు కంటే నరసింహానాయుడుకు తిరుగులేని టాక్ రావడంతో అప్పుడు ఈ రెండు సినిమాలకు థియేటర్లు తగ్గించేసి బాలయ్య నరసింహానాయుడకు ఇచ్చారట. అలా నరసింహానాయుడు నైజాంలో 175, 200 రోజులు కూడా ఆడి అందరికి బంపర్ లాభాలు తెచ్చిపెట్టింది. హైదరాబాద్‌లోనూ ఈ సినిమా క్రాస్‌రోడ్స్‌లో 200 రోజులకు పైగా ఆడింది.