నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్‌ను 2000వ దశకం టైంలో టర్న్ చేసిన సినిమా సమరసింహారెడ్డి. అప్పటి వరకు తెలుగులో ఉన్న యాక్షన్ సినిమాలను బీట్ చేసి సరికొత్త యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది సమరసింహారెడ్డి. 1999 సంక్రాంతి కానుకగా చిరంజీవి స్నేహంకోసం సినిమాకు పోటీగా వచ్చిన ఈ సినిమా ఎన్నో సంచలన రికార్డులు క్రియేట్ చేసింది. ఆ రోజుల్లోనే 77 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.
బి. గోపాల్ – బాలయ్య కాంబినేషన్లో ఈ సినిమా హ్యాట్రిక్ సినిమా. సిమ్రాన్, అంజలాఝవేరి, సంఘవి హీరోయిన్లు. జయప్రకాష్‌రెడ్డి విలన్‌గా నటించారు. రాయలసీమ ఫ్యాక్షన్ డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కింది. అసలు ఈ సినిమా ఎలా ప్లాన్ చేసుకున్నారు ? దీని వెనక ఉన్న ఆసక్తికర విశేషాలేంటో చూద్దాం. బాలయ్య – బి. గోపాల్ కోసం రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ కథ రాసుకున్నారు. అది బి. గోపాల్‌కు నచ్చలేదు.. ఆ కథ కోదండ రామిరెడ్డి చేతుల్లోకి వెళ్లి బొబ్బిలిసింహంగా మారింది.
ఆ తర్వాత మరోసారి బి. గోపాల్ సూచన మేరకు ఫ్యాక్షన్ నేపథ్యంలో విజయేంద్రప్రసాద్ స్టోరీ రాసుకున్నారు. ఈ కథ గోపాల్‌కు పిచ్చగా నచ్చేయడంతో పరుచూరి బ్రదర్స్ ఎంటర్ అయ్యారు. ఓ హోటల్లో కూర్చోని కథ చెప్పడంతో ఇంటర్వెల్‌కు ముందు బాలయ్యకు సత్యనారాయణ నమస్కారం పెట్టే సీన్ అనుకున్నారట. అయితే పరుచూరి బ్రదర్స్ దానిని ఫస్టాఫ్‌లో మిడిల్‌కు మార్చేశారు.
వాస్తవానికి సినిమాలో సత్యనారాయణకు, బ్రహ్మానందంకు క్యారెక్టర్స్ లేవు. అయితే దర్శకుడు గోపాల్ పట్టుబట్టి వారిద్దరి పాత్రలు క్రియేట్ చేయించి సీన్లు రాయించారు. సీతాకోక చిలుక సీన్‌కు రాశి నో చెప్పడంతో ఈ ప్లేస్‌లోకి సిమ్రాన్ వచ్చి చేరింది. లేకపోతే ఈ క్యారెక్టర్ కోసం ముందుగా రాశిని అనుకున్నారు. ఇక సినిమాకు ముందుగా సమరసింహం అన్న టైటిల్ అనుకున్నారు. అయితే సింహం అంటే జంతువు అన్న అర్థం వస్తుందని జంతువుకు వేటాడడం మాత్రమే వచ్చు.. అదే సమరసింహారెడ్డి అని పెడితే వేటాడడంతో పాటు విచక్షణ రెండూ వస్తాయని పరుచూరి ఇచ్చిన సలహా మేరకు ఆ టైటిల్ పెట్టారు.
వాసు క్యారెక్టర్‌కు చాలా మంది పేర్లు అనుకున్నాక పృథ్విని ఫైనల్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ ప్రారంభమైంది. రామోజీఫిల్మ్ సిటీతో పాటు అవుట్ డోర్ కర్నూలు, విజయనగరం, బొబ్బిలిలో తీశారు. కొత్తవలస రైల్వేస్టేషన్లో స్టేషన్ సీన్ తీశారు. అక్కడ బాలయ్యను చూసేందుకు ఫ్యాన్స్ విపరీతంగా రావడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
84 రోజుల్లో రు. 6 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాకు మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ రిలీజ్‌కు ముందే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. 1999 జనవరి 13న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సమరసింహారెడ్డికి తొలి రోజు తొలి షో నుంచే అదిరిపోయే టాక్ వచ్చింది. అప్పట్లోనే 30కు పైగా కేంద్రాల్లో 175 రోజులు ఆడిన ఈ సినిమా కేవలం రు. 10, 15 టిక్కెట్ రేటుతో రు. 20 కోట్లుకు పైగా వసూళ్లు రాబట్టింది. తమిళంలో షణ్ముక్ పాండియన్‌గా, బాలీవుడ్‌లో రఖ్‌వాలాడాగా డబ్ అయ్యింది. బాలయ్యకు కమిషనర్ హోదాలో సత్యనారాయణ నమస్కారం చేసే సీన్‌కు రజనీకాంత్‌కు పిచ్చగా ఫిదా అయిపోయారు.