నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలయ్య 108వ సినిమా పట్టాలు ఎక్కేయనుంది. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు. సాహు గారపాటి, చంటి పెద్దింటి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కూడా బాలయ్య వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లనున్నారు.
ఈ క్రమంలోనే బాలయ్య నెక్ట్స్ లైనప్ పై క్లారిటీ వస్తోంది. బాలయ్యతో ఇప్పుడు ఓ అదిరిపోయే కాంబినేషన్ రాబోతోంది. బాలయ్య చిన్నల్లుడు, వైజాగ్ గీతం విద్యా సంస్థల అధినేత మతుకుపల్లి శ్రీ భరత్ సినిమా నిర్మాణంలోకి రాబోతున్నారు. కొద్ది రోజులుగా బాలయ్య వ్యవహారాలను ఆయన రెండో కుమార్తె తేజస్విని దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు.
బాలయ్య సినిమాల కథలు వినడంలోనూ, ఆయన డిజైన్లు, లుక్ తదితర వ్యవహారాలను ఆమే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అలాగే తండ్రి సినిమాల షూటింగ్‌లకు వెళుతూ నిర్మాణ వ్యవహారాలు కూడా పర్యవేక్షిస్తూ.. పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నట్టుగా తెలుస్తోంది.
బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఆదిత్య 369 సీక్వెల్ ను తమ సొంత బ్యానర్‌పై నిర్మిస్తారని.. దానికి తేజస్విని నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్ ?? ఇక బాలయ్య – బోయపాటి శ్రీను సినిమాను 14 రీల్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సినిమాలోనూ 20 శాతం వాటాను తేజస్విని, ఆమె భర్త భరత్ ఉండేలా చర్చలు నడుస్తున్నాయి. నిర్మాణ రంగంలోకి ఎంటర్ అయ్యేందుకు తేజస్వినితో పాటు శ్రీ భరత్ ఇద్దరూ కూడా ఆసక్తిగానే ఉన్నారట. ఈ సినిమా వచ్చే యేడాది జూన్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.