సినిమాల్లో అనేక మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ.. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క స్టయిల్. దాదాపు అందరూ కూడా.. వినయంతో సర్దుకునేవారు. ఎక్కువ మంది అందరినీ కలుపుకొని కుటుంబ సభ్యులుగా ఉండేవారు. నోటి దురుసు.. అహం అసలు ఉండేవి కాదు. అవార్డుల కోసం వెంపర్లాటలు అసలు కనిపించేవి కూడా కావు. సావిత్రి మహానటి. కోట్లకు పగడలెత్తారు. అయితేనేం. ఎంతో విధేయత. అంతకు మించిన నమ్రత. సీనియర్లు.. జూనియర్లు అనే తేడా లేనేలేదు.
ముఖ్యంగా సాటి నటీమణులను చాలా సొంతం అనుకునేవారు. వరసలు పెట్టి వదిన, అక్కడ, ఏవే..! అని కూడా పిలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇక, అంజలీ దేవి కూడా అంతే. చాలా మందిని పైకి తీసుకువచ్చారు. సొంత బ్యానర్ పెట్టి అనేక మందికి అవకాశం కల్పించారు. ఎవరితోనూ వివాదాలు లేవు. ఎవరితోనూ.. విమర్శలు కూడా లేవు. అందరినీ కలుపుకొని పోయేవారు. మధ్యాహ్నం 2 అయితే.. చాలు.. ఎంత మంచి సీన్ అయినా.. ఎంత ఖర్చు పెట్టి తీస్తున్నా.. కట్ చెప్పేసేవారట.
అదేమంటే.. “అన్నాలకు టైం అయింది. మీకేం.. ఒక దమ్ము లాగివస్తే.. కడుపు నిండిపోతుంది. మా బాధలు మీకేం తెలుసు.. పదండమ్మాయిలూ.. ఆకళ్లేయట్లేదా.. ? మీరు ఇక్కడే ఉంటే.. డైరెక్టర్‌గారు.. రేపు షూటింగ్ కూడా ఇప్పుడే చేసేస్తారు“ అని ఆత్మీయతతో కూడిన పలకరింపులతో అన్నాలకు తీసుకువెళ్లి.. స్వయంగా వడ్డించేవారు. ఇక, క్యారెక్టర్ ఆర్టిస్టు అయిన.. సూర్యాకాంతం కూడా అంతే!
“ఏమయ్యా డైరెట్రూ.. ఆకలేయట్లా.. ఇంట్లో బాగా మెక్కొచ్చుంటావ్.. అయితే మాన్లే.. ఇది తిను! “ అని చప్పున తన చేతి సంచిలో ఉంచుకున్న ఏదో ఒక పదార్థం పెట్టేవారట. ఇలాంటి ఆత్మీయత ఇప్పుడు కనిపించడంలేదు. ఎవరికి వారు రిజర్వ్. హీరో ఇతర ఆర్టిస్టులతో కలవరు. హీరోయిన్ పరిస్థితి కూడా అంతే. క్యారెక్టర్ ఆర్టిస్టులు గంటల చొప్పున తీసుకుని కట్ చెప్పగానే చెక్కేస్తున్నారు.
అసలు ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తోంది అంతా నాకేంటి.. నీకేంటి అన్నదే. ఇప్పుడు బంధాలు, అనుబంధాలు పోయాయి. డబ్బు రాజ్యమేలుతోంది. అవసరాల కోసం స్నేహాలు కూడా పణంగా పెట్టేస్తున్నారు. స్వార్థాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఆత్మీయత కొరవడుతోందన్నది సినీ వర్గాల అభిప్రాయం. ఈ పద్ధతి ఇండస్ట్రీకి ఏ మాత్రం మంచిది కాదు.