హాస్యరసాన్ని పండించడమే కాదు.. దానిలో మమేకమైన మహానటులు రేలంగి, అల్లూ రామలింగయ్య. అయితే, వీరిద్దరి మధ్య `బావ` అన్న డైలాగు విషయంలో తీవ్ర వివాదం చోటు చేసుకుంది. అల్లూని రేలంగి బహిరంగంగానే అవమానించారట. అయితే, ఈ విషయంలో జోక్యం చేసుకున్న గుమ్మడి వెంకటేశ్వరరావు సర్దిచెప్పారు. కానీ, తర్వాత కాలంలో అల్లూ ఇదే రిపీట్ చేసినప్పుడు.. సీన్ మొత్తం రివర్స్ అయింది. మరి ఆ కథేంటంటే..!
అప్పట్లో రేలంగి మంచి ఫామ్‌లో ఉన్నారు. ‘ప్రేమించిచూడు’ చిత్రం షూటింగ్ హైదరాబాద్ సారథీ స్టూడియోలో జరుగుతోంది. హాస్య నటుల్లో ఉన్నత స్థానంలో ఉన్న రేలంగి తర్వాత స్థానాల్లో (నెంబర్ 2) ఉన్న అల్లురామలింగయ్య నటిస్తున్నారు. ఓ సన్నివేశంలో కథానుసారం పాత్రల బాంధవ్యాన్ని బట్టి రామలింగయ్య.. రేలంగి గార్ని “బావా” అని పిలిచాడు. వెంటనే రేలంగి “ప్రతి అడ్డమైన వాడు నన్ను బావా అని పిలవటమేమిటి“ అని అభ్యంతరం పెట్టారు.
దీంతో, రామలింగయ్య మొహం చిన్నబోయింది. వెంటనే షూటింగ్ నుంచి బయటకు కూడా వెళ్లిపోయారట. దీంతో ఈ విషయాన్ని గమనించి.. అక్కడే ఉన్న గుమ్మడి వెంకటేశ్వరావు.. రేలంగిని ఉద్దేశించి “రేలంగి గారూ ! మీరు అలా మాట్లాడటం తప్పు. మనం పాత్రల పరంగా వ్యవహరించాలే తప్ప వ్యక్తిగత జీవితానికి అన్వయించకూడదు. దయచేసి మీ ధోరణి మార్చుకోండి” అని కొంచెం గట్టిగానే చెప్పారు. దీంతో రేలంగి ఒక్క క్షణం ఆలోచించి “అంతేనంటారా” అన్నారు. “అవునండీ, అంతే !” అన్నారట గుమ్మడి.
ఆ మరుక్షణం.. హాస్యనటుడుగదా, వెంటనే తన తప్పు తెలుసుకొని నవ్వుల్లో పెట్టి “మీ అందరి అభిప్రాయం అదే అయితే నా అభిప్రాయం అదే” అంటూ సన్నివేశం పూర్తి చేశారు. కట్ చేస్తే … 15 సంవత్సరాల తరువాత … అదే సారథీ స్టూడియోలో ఓ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అప్పటికి ఆర్థికంగా బలంగా ఉన్న అల్లు రామలింగయ్య షూటింగుకు వచ్చారు. పక్కన మరో చిన్న హాస్యనటుడు ఉన్నాడు. యాదృచ్ఛికంగా అటువంటి సన్నివేశమే చిత్రీకరించారు. ఆ హాస్యనటుడు పాత్రపరంగా “బావా” అనగానే రామలింగయ్యగారు రియాక్ట్ అవుతూ అభ్యంతరం పెట్టారు.
ఇదంతా చూస్తున్న గుమ్మడి “అయ్యా! రామలింగయ్యగారూ ! పదిహేను సంవత్సరాల క్రితం ఇక్కడ జరిగిన ‘ప్రేమించిచూడు’ సంఘటన మీరు మర్చిపోయారా! ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి” అన్నారట. అంతే పాపం స్థాణువైపోయాడు అల్లు. ఆయన మేనరిజం వుందిగదా ! వెంటనే చేతులు పైకెత్తి నమస్కారం పెట్టి “అయ్యబాబోయ్! మీరు యిక్కడే వున్నారా !” అని తన తప్పు తెలుసుకొని ఆనాటి రేలంగి లాగానే రామలింగయ్య కూడా సర్దుకున్నారట.