“ఔను.. ఆమెకు గడుసుతనం.. ఎవరి మాటా వినదు!“.. ఇదీ ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించిన మాట. అంతేకాదు.. “దుర్వాసురాలు స్టూడియోలోనే ఉందా? ఇంకా వెళ్లలేదా?“ అని వివరాలు కనుక్కుని మరీ సాటి నటులు స్టూడియోలకు వచ్చేవారట. ఆమెతో కలిసి నటించడం అంటే.. ముందే.. గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకుని.. స్వామీ ఈరోజు ఏం జరగకుండా చూడు! అని కోరుకుని మరీ వచ్చేవారట.
ఇంతకీ ఆమె ఎవరు..? అంటే ప్రత్యేకంగా చెప్పేదేముంది? ఆవిడే.. తెలుగు వారి అత్తగారు(అత్తగారి కథలు పుస్తకం చాలా ఫేమస్) భానుమతి. `సంప్రదాయాలకు అగ్నితో పునీతం చేసే బ్రాహ్మణ కుటుంబం నుంచి అనూహ్యంగా జాలువారిని అందాల రాక్షసి` అని అప్పట్లోనే సముద్రాల సీనియర్‌తో పొగడ్తలు కురిపించుకున్న మహానటి..! అయితే.. ఆమెకు ఉన్న ఒకే ఒక లక్షణం.. ఎవరినీ లెక్క చేయక పోవడం. ఎవరి మాటను పట్టించుకోకపోవడం. ప్రతి విషయంలోనూ అనుమానపు చూపులు చూడడం.
ఇది ఆమె కెరీర్‌ను సగానికి సగం పడేసింది. అనేక సినిమాల్లో ఆమెకు అవకాశాలు లేకుండా చేసింది. అంతేకాదు.. గతంలో హీరో అయినా.. హీరోయిన్ అయినా.. వారి రెమ్యునరేషన్‌ను డైరెక్టర్లు సిఫారసు చేసేవారు. సావిత్ర రెమ్యునరేషన్ పెరగడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. కానీ, భానుమతి విషయానికి వస్తే.. మాత్రం ఎవరూ పెదవి విప్పేవారు కాదు. ఎందుకంటే.. `నా రెమ్యునరేషన్ నిర్ణయించడానికి ఆయనెవరు?“ అని మొహం మీదే అడిగేసేవారు. దీంతో ఎవరూ జోక్యం చేసుకునేవారు.
ఇక, తన రెమ్యునరేషన్ తనే నిర్ణయించుకోవడంతోపాటు.. కాల్ షీట్ల విషయంలోనూ.. తను చెప్పిందే వినాలనే మొండి ఘటం. ఎవరూ తనపై చేయి వేయకూడదు. ఎవరూ తనను వాటేసుకోకూడదు. అసలు అలాంటి సీన్లు ఉన్నాయని చెప్పేందుకే.. డైరెక్టర్లకు గుండెలు దడదడలాడేవి. ఈ కారణంగానే రక్తసంబంధం సినిమాల అన్నగారికి చెల్లెలు పాత్రను ఆమె మిస్ అయ్యారు. చివరి వరకు అంతే నిబద్ధతతో పనిచేశారు. కోల్పోయింది చాలానే ఉన్నా.. దక్కించుకున్నది ఎంతో ఉందని ఆమె చెబుతారు.