RRR విడుదల తర్వాత ఎన్టీఆర్ ఆరు నెలలుగా తన కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు. కొరటాల శివ సినిమాపై ఆరేడు నెలలుగా ఊరించే వార్తలు వస్తున్నాయి. మరోవైపు ప్రశాంత్ నీల్తోనూ పాన్ ఇండియా సినిమాపై ప్రకటన అయితే వచ్చేసింది. ఈ రెండు సినిమాలు ఎన్టీఆర్ కెరీర్లో 30, 31వ ప్రాజెక్టులుగా పట్టాలు ఎక్కుతున్నాయి. మధ్యలో ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా పేరు కూడా ఎన్టీఆర్ లైనప్‌లో వినిపించింది.
ఉప్పెన సినిమా వచ్చాక రెండేళ్లుగా బుచ్చిబాబు ఏ సినిమా చేయలేదు. ఎన్టీఆర్ కోసమే యేడాదికి పైగా ఖాళీగా ఉన్నాడని అన్నారు. అయితే ఇంకా కొరటాల సినిమా పట్టాలు ఎక్కకపోవడం.. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు కూడా వెంటనే ఉండడంతో బుచ్చిబాబు సినిమా ఇప్పట్లో పట్టాలు ఎక్కేలా లేదు. ఈ ప్రాజెక్టులు ఇలా ఉండగానే ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
రీసెంట్గా బ్లాక్‌బస్టర్ కొట్టిన ఓ యంగ్ డైరెక్టర్ ఎన్టీఆర్‌కు స్క్రిఫ్ట్ నెరేట్ చేసినట్టు తెలిసింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు సీతారామం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన హను రాఘవపూడి ఓ అద్భుతమైన లవ్‌స్టోరీని ఎన్టీఆర్‌కు చెప్పాడట. ఇదో బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ అని… ఎన్టీఆర్ సరికొత్తగా ఈ ప్రేమకథలో ఆవిష్కృతం కాబోతాడని అంటున్నారు. రీసెంట్గా హను రాఘవపూడి సీతా రామం లాంటి క్లాసిక్ లవ్ స్టోరీని తెరకెక్కించిన తీరుకు తెలుగు సినీ లవర్స్ ఎంత ఫిదా అయిపోయారో చూశాం.
ఇప్పుడు హను కథను ఎన్టీఆర్ ఓకే చేసినా కూడా ఇప్పట్లో ఈ ప్రాజెక్టు అయితే పట్టాలు ఎక్కుతుందని అనుకోలేం. కొరటాల, ప్రశాంత్ నీల్ సినిమాలు పూర్తయ్యే సరికే రెండేళ్లు పడుతుంది. ఆ తర్వాతే ఇది ఉండే ఛాన్స్ ఉంది. క్లాసిక్ డైరెక్టర్ అయిన హను మాస్ హీరో ఎన్టీఆర్ కాంబోలో సినిమా అంటే అది ఖచ్చితంగా ఇంట్రస్టింగ్ కాంబో కానుంది.