కే. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని ఈసినిమాను రాగరంజితంగా తెరకెక్కించారు. ఇది తొలి వారం పెద్దగా ఆడకపోయినా, తర్వాత తర్వాత పుంజుకుని ఏళ్లతరబడి దూసుకుపోయింది. జె. వి. సోమయాజులు – మంజుభార్గవి – రాజ్యలక్ష్మి – అల్లు రామలింగయ్య – చంద్రమోహన్ ముఖ్యపాత్రలు పోషించారు. కె.వి. మహదేవన్ సంగీతం ప్రేక్షకులకు సూపర్‌గా కనెక్ట్ అయ్యింది.
కమర్షియల్ హంగులు లేకుండా బ్లాక్‌బస్టర్ కొట్టిన ఘనత ఈ సినిమాకే దక్కుతుంది. అన్నగారు ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఈ సినిమాను వీక్షించారు. అప్పటికి ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చే ఆలోచనల్లో ఉన్నారు. ఆ టైంలో ఆయన వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. నిజానికి ఈ సినిమాను ఎన్టీఆర్‌తో తీయాలని పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు అడిగారట.
అయితే, ఇందులో హీరో అంటూ ప్రత్యేకంగా ఉండరు. ఉన్నా.. ప్రౌఢ పాత్ర. దీనికి అన్నగారు ఒప్పుకోరని.. భావించిన దర్శకుడు విశ్వనాథ్.. శోభన్‌బాబును పెట్టి తీయాలని అనుకున్నారు. అయితే, కథ విన్న శోభన్‌బాబు.. అప్పటికే రొమాంటిక్ హీరోగా తనకున్న ఇమేజ్ పోతుందని భావించి వద్దన్నారు. దీంతో సినిమాను సోమయాజులును పెట్టి తీశారు. ఇది తర్వాత కాలంలో సూపర్‌డూపర్ హిట్టయింది. పాటలు అజరామరంగా నిలిచిపోయాయి.
ఈ విషయం తెలిసిన అన్నగారు.. విశ్వనాథ్‌కు ఒక టాస్క్ ఇచ్చారు. “మన బ్యానర్‌పైనే తీద్దాం.. ఇలాంటి కథే ఉంటే రండి“ అని కబురు పెట్టారు. అయితే, ఇలాంటి కథలేదు… కానీ, అంటూ.. వేరే కథ చెప్పారు. అదే.. `స్వాతి ముత్యం`. ఈ కథ విన్నాక ఎన్టీఆర్ తర్వాత చూద్దామని అన్నారు. ఇక, ఆ తర్వాత.. విశ్వనాథ్ ఆయన దగ్గరకు వెళ్లింది లేదు. కథ చెప్పింది కూడా లేదు. కానీ, విశ్వనాథ్ తీసిన స్వాతి ముత్యం కూడా సూపర్ హిట్టయింది.