సినిమాల్లో సెటైర్లు వేయడం, సెటైరికల్ సినిమాలు తీయడం అన్నది గతం నుంచి ఉన్నదే. అయితే ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఏకచక్రాధిపత్యంతో దూసుకుపోయి.. అటు రాజకీయాల్లో కూడా తిరుగులేని స్టార్‌గా వెలుగొందుతున్నారు. అలాంటి టైంలో కృష్ణ ఎన్టీఆర్‌ను ఢీ కొట్టడంతో పాటు ఆయనపై పొలిటికల్‌గా సెటైర్లు వేస్తూ సినిమాలు చేశారు. వంగవీటి రంగా హత్యను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన తీసిన మండలాధీశుడుకు మంచి పేరు వచ్చింది.
అలాగే ఎన్టీఆర్‌నే టార్గెట్ చేసిన మరో సినిమా సాహసమే నా ఊపిరి వంటి సినిమాల వెనుక కూడా సూపర్ స్టార్ కృష్ణ ఉన్నారు. నటుడు ప్రభాకర్ రెడ్డి, కృష్ణ ఇద్దరూ ఈ సినిమాలకు కీలకంగా వ్యవహరించారు.
ఆ రోజుల్లో ఎన్టీఆర్‌పై సినిమాలు తీయడమంటేనే పెద్ద సాహసం. కాని కృష్ణ మాత్రం చాలా డేరింగ్ స్టెప్ వేసి మరీ ఆ సినిమాలు సూపర్ హిట్ చేశారు. ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా దుబాయ్ శీను సినిమా వచ్చింది.
ఈ సినిమాలో ఎంఎస్. నారాయణతో శ్రీను వైట్ల ఫైర్ స్టార్ సాల్మాన్ రాజు పాత్ర చేయించారు. ఈ పాత్ర కల్ట్ హిట్ అయ్యింది. అయితే ఈ పాత్రకు సూపర్‌స్టార్ కృష్ణే స్ఫూర్తి అన్న టాక్ అప్పట్లో వచ్చింది. అయితే శ్రీను వైట్ల సినిమాలలో రెండు , మూడు సార్లు ఈ తరహాలో ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి.
కింగ్ సినిమాలో బ్రహ్మానందం పాత్ర కూడా మ్యూజిక్ డైరెక్టర్ చక్రిని ఉద్దేశించి పెట్టిందే అన్న టాక్ వచ్చింది. తర్వాత ఇది పెద్ద వివాదం అవ్వడం.. శ్రీను వైట్ల అది చక్రిని ఉద్దేశించి పెట్టింది కాదని వివరణ ఇవ్వడం జరిగాయి.
ఆ పాత్ర బాగా హిట్ అయ్యాక తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఎంఎస్. నారాయణే స్వయంగా ఈ పాత్రకు సూపర్‌స్టార్ కృష్ణగారు స్ఫూర్తి అని చెప్పారు. అయితే ఆ తర్వాత కృష్ణను ఎంఎస్. నారాయణ కలిసినప్పుడు తనపై వేసిన సెటైర్‌ను చాలా సింపుల్‌గా తీసుకోవడంతో పాటు భలే చేశావయ్యా అంటూ తనతో నవ్వుతూ అన్నారని ఎమ్మెస్ చెప్పారు. తనకు వచ్చినట్టుగా డ్యాన్స్ చేయడం, సెట్లోనే హీరోయిన్లతో రొమాన్స్, ఫన్నీగా ఉన్న హీరోయిజం లాంటి వాటినే సాల్మన్‌రాజు పాత్రలో చూపించారు. అది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది.
ఇది కృష్ణపై వేసిన సెటైర్‌గా అప్పట్లో ప్రచారం జరిగినా కృష్ణ సరదాగా తీసుకుని ఎంజాయ్ చేశారు. విచిత్రం ఏంటంటే ఆ తర్వాత ఆ సినిమా దర్శకుడు శ్రీను వైట్లతోనే మహేష్‌బాబు దూకుడు లాంటి బ్లాక్‌బస్టర్, ఆ తర్వాత ఆగడు సినిమాల్లో నటించారు.