సంక్రాంతి బరిలో రెండు పెద్ద హీరోల సినిమాలు దిగుతున్నాయి. బాలయ్య నటిస్తోన్న వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. తాజాగా ఈ రెండు సినిమాల నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. అయితే ఎప్పుడూ లేనట్టుగా విడ్డూరంగా ఈ సారి ఈ రెండు సినిమాల నిర్మాతలు ఒక్కరే. రెండు సినిమాలు మైత్రీ మూవీస్ బ్యానర్ మీదే తెరకెక్కాయి. మైత్రీ వాళ్లకు కూడా రెండు సినిమాలు ఒకేసారి రావడం పెద్ద తలనొప్పే. అయినా అవన్నీ భరించే రెండు సినిమాలు సంక్రాంతి బరిలో దింపుతున్నారు.
ఇప్పుడు వాళ్లకు రెండు సినిమాలకు రిలీజ్‌కు ముందే ఒకే బజ్ తీసుకురావడం పెద్ద సవాల్‌గా మారింది. ఇక ఇద్దరు హీరోల అభిమానులు అప్పుడే మా హీరో సినిమా గొప్పదంటే.. మా హీరో సినిమా గొప్పదని ప్రచారం మొదలు పెట్టేశారు. రిలీజ్‌కు ముందే పై చేయి సాధించాలన్న కూతూహలం ఇద్దరు హీరోల అభిమానుల్లోనూ కనిపిస్తోంది. ఇక రెండు సినిమాల ఫస్ట్ సింగిల్ చూస్తే వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ, వీరసింహారెడ్డి జై బాలయ్య సాంగ్ రెండిటికి మరీ అదిరిపోయేంత టాక్ అయితే లేదు.
రెండిటికి ఎంతో కొంత కాపీ మరకలు అయితే అంటుకున్నాయి. బాస్ పార్టీ సాంగ్ రాసింది.. పాడింది.. ట్యూన్ ఇచ్చింది దేవీయే. పదాలు, ట్యూన్ ఏ మాత్రం క్యాచీగా లేవు. అప్పుడెప్పుడో శింబు నటించిన తమిళ సినిమా సిలంబాట్టన్ సినిమాలోని వేరీజ్ ద పార్టీ సాంగ్‌ను లేపేసినట్టుగా చెపుతున్నారు. అసలు దేవీ సాహిత్యం అయితే చాలా ఘోరంగా, పేలవంగా ఉంది. ట్యూన్ పరంగాను, లిరికల్‌గాను రెండిట్లోనూ దేవీ ఫెయిల్ అయ్యాడు.
ఇక జై బాలయ్య చేసిన థమన్ 1990ల్లో వచ్చిన విజయశాంతి ఓసేయ్ రాములమ్మ ట్యూన్‌ను ఎత్తేసి తిరగమోతేశాడన్న విమర్శలు వస్తున్నాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన పదాలు ఎంత పవర్ ఫుల్‌గా ఉన్నా అక్కడక్కడ పాత సాహిత్యాన్ని గుర్తు చేసినట్టుగానే ఉన్నాయి. ఓవరాల్‌గా రెండు సాంగ్‌లు కూడా మరీ అంత హైప్ తెచ్చేలా లేవన్నదే నిజం. ఇక రెండో సింగిలైనా పాతపాటల వాసనలు, కాపీ మరకలు లేకుండా వస్తాయని ఆశిద్దాం. అయితే ఉన్నంతలో దేవిశ్రీ రాసి, కంపోజ్ చేసిన ట్యూన్ కంటే జై బాలయ్య సాంగ్ కాస్త వినడానికి అయినా బాగుంది. మాస్‌కు కాస్త జోష్ ఇచ్చేలా ఉంది. అదొక్కటే బాలయ్య ఫ్యాన్స్‌కు కాస్తూ ఊరట.