సంక్రాంతి బరిలో ఇద్దరు పెద్ద హీరోలు పోటీ పడుతున్నారు. చిరు వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి రెండు కూడా లైన్లో ఉన్నాయి. ట్విస్ట్ ఏంటంటే ఈ రెండు సినిమాలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీదే వస్తున్నాయి. దీంతో ఈ నిర్మాతలకు ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఇక పెద్ద సినిమాలు రిలీజ్ అయితే నైజాంలో మాగ్జిమం దిల్ రాజు చేతుల్లోకి వెళ్లిపోవాల్సిందే. అయితే ఈ సారి మాత్రం మైత్రీ వాళ్లు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రెండు సినిమాలను తమ సొంత డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ద్వారా పంపిణీ చేసుకుంటున్నారు.
ఇందుకోసం వాళ్లు హైదరాబాద్‌లో ఆఫీస్ కూడా ఇప్పటికే ఓపెన్ చేసి థియేటర్లు లాక్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే మైత్రీ వాళ్ల రెండు సినిమాలకు థియేటర్లు ఇవ్వవద్దన్న ఒత్తిళ్లు ఇప్పటికే పని చేస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఇక వైజాగ్‌లోనూ మంచి థియేటర్లు అన్నీ వీరసింహారెడ్డి, వీరయ్య కంటే దిల్ రాజు సొంత సినిమా వారసుడికే వెళుతున్నాయి.
ఓ వైపు అగ్ర నిర్మాత దిల్ రాజు సొంత సినిమా వారసుడు కావడంతో మంచి డిస్ట్రిబ్యూటర్లతో పాటు టాప్ థియేటర్లు అన్నీ ఆ సినిమాకే వెళుతున్నాయి. ఇక ఈ రెండు సినిమాలు ఒక్క రోజు తేడాలో థియేటర్లలోకి దిగుతున్నాయి. ముందుగా చిరంజీవి వాల్తేరు వీరయ్య జనవరి 12న, బాలయ్య వీరసింహా రెడ్డి జనవరి 13న విడుదల అవుతున్నాయి. ఇక ఏరియాల వారీగా బాలయ్య, చిరు సినిమాలకు పోటాపోటీగా థియేటర్లను లాక్ చేస్తున్నారు.
నైజాంలో వారసుడు ఇద్దరు పెద్ద హీరోల స్ట్రైట్ సినిమాలకు పోటీగా థియేటర్లు ఆక్రమిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం దిల్ రాజే అన్నది తెలిసిందే. ఆ తర్వాత వీరయ్య, వీరసింహా సినిమాలకు కూడా థియేటర్లు ఇస్తున్నా ఒకటి, రెండు థియేటర్లు వీరయ్యకే ఎక్కువుగా దొరుకుతున్నాయి. అయితే సింగిల్ స్క్రీన్ ఉన్న చోట రెండు సినిమాలు ప్రదర్శించేలా ఒప్పందం జరుగుతోంది.
ఇక సీడెడ్‌లో మాత్రం వీరసింహారెడ్డికి జరుగుతోన్న బిజినెస్‌తో పాటు ఇస్తోన్న థియేటర్లతో పోలిస్తే వీరయ్యకు మూడొంతుల బిజినెస్, థియేటర్లు కూడా దొరకడం లేదు. సింగిల్ స్క్రీన్లు ఉన్న ఊళ్లలో కూడా బాలయ్య సినిమాలే వేస్తామంటున్నారు. అడ్వాన్స్‌లు కూడా బాలయ్య సినిమాకు మాత్రమే ఇస్తామంటున్నారు. రెండు సినిమాల నిర్మాతలు ఒక్కరే కావడంతో మైత్రీ వాళ్లు రెండిటికి కలిపి లింక్ పెట్టి అమ్మాలని చూస్తున్నా కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదు. సీడెడ్‌లో వీరసింహుడి జోరు మామూలుగా లేదు.