వచ్చే సంక్రాంతి కానుకగా టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ట నటిస్తోన్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రెండు సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి. అఖండ తర్వాత బాలయ్య చేస్తోన్న సినిమా వీరసింహారెడ్డి. ఇటు ఆచార్య, గాడ్‌ఫాదర్ తర్వాత చిరు నటిస్తోన్న సినిమా వాల్తేరు వీరయ్య. రెండు సినిమాలు కూడా మైత్రీ మూవీస్ బ్యానర్లోనే తెరకెక్కుతున్నాయి.
దీంతో నిర్మాతలు చాలా చోట్ల రెండు సినిమాల పంపిణీ రైట్స్ కలిపి అమ్ముతున్నారు. చాలా ఏరియాల్లో ఇప్పటికే ఈ పద్ధతిలో బిజినెస్ డీల్స్ క్లోజ్ అవుతున్నాయి. నైజాంలో ఈ రెండు సినిమాల రైట్స్ రు. 35 కోట్లకు విలువ కట్టారు. ఇక్కడ ఈ రెండు సినిమాలు వీరే సొంతంగా పంపిణీ చేసుకుంటున్నారు. ఇక సీడెడ్‌కు వచ్చే సరికి రెండు సినిమాలకు రు. 24 కోట్లు కోడ్ చేశారు.
అయితే ఇక్కడే డిస్ట్రిబ్యూటర్లు తిరకాసు పెడుతున్నారు. సీడెడ్ వరకు బాలయ్య సినిమా విడిగా ఇవ్వాలని… అలా అయితేనే తాము మంచి రేటు ఇచ్చి తీసుకుంటామని ఖరాఖండీగా చెపుతున్నారు. అంతేకాని చిరు సినిమా కూడా బాలయ్య సినిమాకు లింక్ చేసి చెపితే తాము కొనమని చెప్పేస్తున్నారట. సీడెడ్‌లో ఆచార్యకు రు. 4 కోట్లు కూడా రాలేదు. ఇక గాడ్‌ఫాదర్ సినిమా సూపర్ హిట్ అన్నారు. అయితే రు. 8 కోట్లు కూడా వసూలు కాలేదు. అందుకే ఇప్పుడు వాల్తేరు వీరయ్యకు రు. 8 కోట్లు కూడా పెట్టేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు.
అదే బాలయ్య వీరసింహారెడ్డి వరకే చూస్తే ఏకంగా రు. 15 కోట్లకు తగ్గకుండా పెట్టేందుకు రెడీగా ఉన్నారు. అవసరం అయితే మరో కోటి కూడా బాలయ్య సినిమాకు పెట్టేందుకు ఒకరిద్దరు డిస్ట్రిబ్యూటర్లు రెడీగా ఉన్నారు. అంతే కానీ మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ముడిపెట్టి ఇస్తామంటే మాత్రం తీసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఓవరాల్‌గా చూస్తే సీడెడ్‌లో ఎప్పటకీ బాలయ్యే కింగ్ అన్నది ట్రేడ్ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి.