కృష్ణ, విజయనిర్మల పెళ్లి టాలీవుడ్లో అప్పట్లో పెద్ద సంచలనం. అయితే వీరి పెళ్లి అచ్చు సినిమా ట్విస్టులను తలపించేలా జరిగింది. అప్పటికే విజయనిర్మలకు కృష్ణమూర్తితో పెళ్లి జరిగి నరేష్ పుట్టాడు. అయితే పెళ్లి తర్వాత కూడా విజయనిర్మలకు సినిమాల్లో చేయాలన్న కోరిక ఉండేది. అది కృష్ణమూర్తికి ఇష్టంలేదు. ఆ టైంలో కృష్ణతో ఎక్కువ సినిమాల్లో నటిస్తోన్న క్రమంలో సహజంగానే స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలనే వరకు వచ్చేసింది.
అప్పటికే ఇటు కృష్ణకు కూడా మరదలు ఇందిరాదేవితో పెళ్లి జరిగి పిల్లలు కూడా ఉన్నారు. అప్పటికే కృష్ణ స్టార్ హీరోగా ఉన్నాడు. ఆ టైంలో రెండో పెళ్లి అంటే జనాల్లో వ్యతిరేకత కూడా వచ్చే ప్రమాదం ఉంది. కొందరు కృష్ణను రెండో పెళ్లి వద్దని హెచ్చరించారు. అయినా కూడా వెనక్కు తగ్గలేదు. వీరిద్దరు కలిసి తొలిసారిగా సాక్షి సినిమాలో నటించారు. బాపుకు అదే తొలి సినిమా. ఆ సినిమా షూటింగ్‌లో భాగంగా తొలిసారిగా కృష్ణను అద్దంలోనుంచి చూసిన విజయనిర్మల ఈ అబ్బాయి ఎవరో బాగున్నాడే అనుకున్నారట.
అయితే ఆ తర్వాత అతడే ఈ సినిమాలో హీరో అని తెలుసుకుని ఆశ్చర్యపోయిందట. కృష్ణలోని అందం, బీడియం, సిగ్గు ఆమెను బాగా ఆకర్షించింది. అందుకే ముందుగా ఆమె తెలియకుండానే ప్రేమలో పడిపోయింది. సాక్షి సినిమాలో పెళ్లి సీన్‌ను తూర్పుగోదావరి జిల్లాలోని పులిదిండి మీసాల కృష్ణుడి ఆలయంలో షూట్ చేశారట. ఆ సమయంలో కమెడియన్ రాజబాబు.. ఈ స్వామి చాలా మహిమకలవాడు.. మీకు నిజంగానే పెళ్లయిపోతుందని చమత్కరించారు. అయితే నిజంగానే ఆ మహిమతో వారికి పెళ్లయ్యింది.
విజయనిర్మల నటి మాత్రమే కాదు.. దర్శకురాలు కూడా..! పెళ్లి తర్వాత కూడా ఆమె కెరీర్ కొనసాగించాలన్న విషయంలో వచ్చిన విబేధాలతో భర్తకు దూరమైపోయింది. అయితే వీరి పెళ్లికి ఆయన సన్నిహితులే చాలా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే తనకు అత్యంత సన్నిహితుడు అయిన చంద్రమోహన్ వీరి పెళ్లికి సహకరించారు. ముందుగా చంద్రమోహన్‌ను విజయనిర్మల దగ్గరకు మధ్యవర్తిత్వం పంపారు. మీకు ఇష్టమైతే కృష్ణగారు మిమ్మలను పెళ్లి చేసుకుంటారట అని అడిగారట.
వెంటనే విజయనిర్మల ఆయనకు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ఆయన్నే అడగమనండి అన్నారట. చివరకు కృష్ణే స్వయంగా విజయనిర్మల వద్దకు వెళ్లి పెళ్లి గురించి అడగగా అప్పటికే కృష్ణను మనసంతా నింపుకున్న విజయనిర్మల వెంటనే ఓకే చెప్పేశారట. వారిద్దరికి అప్పటికే అది రెండో పెళ్లి కాబట్టి.. ఈ పెళ్లి సీక్రెట్‌గా చేసే బాధ్యతను చంద్రమోహనే భుజాన వేసుకున్నారట.
కృష్ణ, విజయనిర్మల, చంద్రమోహన్‌తో పాటు మరో ఇద్దరు ముగ్గురు కృష్ణ సన్నిహితులు సీక్రెట్‌గా తిరుపతి వెళ్లగా అక్కడే స్వామి సన్నిధిలో కృష్ణ.. విజయనిర్మల మోడలో మూడు ముళ్లు వేశారు. ఆ టైంలో కృష్ణ – విజయనిర్మల కలిసి నటిస్తోన్న సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అందులో సీఎస్. రావు డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కూడా ఉంది. దీంతో ఈ సినిమాకు మళ్లీ పెళ్లి అనే టైటిల్ పెట్టేశారు. తిరుపతి నుంచి వచ్చాక కృష్ణ .. తాను విజయనిర్మలను పెళ్లి చేసుకున్న విషయం చెప్పారు. ముందు ఆమె ఆవేదన చెందినా తర్వాత భర్త మనసు అర్థం చేసుకుని సర్దుకుపోయింది.