టాలీవుడ్‌లో నాలుగు దశాబ్దాల పాటు కృష్ణ తిరుగులేని స్టార్ హీరోగా కొనసాగారు. 1965లో సినిమాల్లోకి వచ్చిన కృష్ణ 1990 వరకు తిరుగులేకుండా దూసుకుపోయారు. 1990 తర్వాత చిరు-బాలయ్య లాంటి హీరోల ప్రాభవం స్టార్ట్ అయ్యింది. అప్పటకీ కృష్ణ జోరు కొంత తగ్గినా ఆ తర్వాత కూడా ఆయన హిట్ సినిమాలు చేశారు. నాలుగు దశాబ్దాల పాటు అప్రతిహతంగా కొనసాగిన తన సినీ కెరీర్‌లో కృష్ణ 340కు పైగా సినిమాల్లో నటించారు.
ఆయన నిర్మాతల హీరో. తనతో సినిమాలు చేసిన నిర్మాతలు సినిమాలు ప్లాప్ అయ్యి కష్టాల్లో ఉంటే ఆయన నెక్ట్స్ సినిమాకు ఫ్రీగా డేట్లు ఇచ్చేసేవారు. తన సినీ ప్రస్థానంలో ఎన్నో సాహసాలు చేసిన కృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఆయన పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్ సినీ చరిత్రలో ఎంతో మంది హీరోలు వచ్చి.. స్టార్ హీరోలు అయినా కూడా కృష్ణకు మాత్రమే సొంతమైన కొన్ని రికార్డులు ఉన్నాయి.
1970లో పద్మాలయా బ్యానర్ స్థాపించిన ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు. కృష్ణ దర్శకుడిగాను 16 సినిమాలు తీశారు. కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో ఎన్నో కొత్త సాంకేతికతలు, జానర్లను పరిచయం చేశాయి. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా గూడఛారి 116 – తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు – తొలి పుల్ స్కోప్ సినిమా అల్లూరి – తొలి 70 ఎంఎం సినిమా సింహాసనం ఇవన్నీ కూడా స్కోప్ సినిమాలే.
ఇక 1970-80వ దశకం కృష్ణకు తిరుగులేని స్వర్ణయుగం. యేడాదికి 10కు పైగా సినిమాలు చేసేవారు. 1980లో 17 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆయన రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేసేవారు. ఇక రాజీవ్ గాంధీ – కృష్ణ స్నేహితులు. ఆ స్నేహంతోనే కృష్ణ రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. 1989లో ఏలూరు నుంచి పోటీ చేసి కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత అక్కడ నుంచే 1991లో ఓడిపోయారు. రాజీవ్‌గాంధీ హత్య జరగడం, ఏలూరులో ఓడిపోవడంతో ఆయనకు రాజకీయాల పట్ల విరక్తి ఏర్పడింది.