తెలుగు తెరపై గయ్యాళి పాత్రల్లో నటించి.. ప్రేక్షకులతో తిట్లు తినిపించుకున్న వారిలో తొలి స్థానంలో నిలిచారు మహానటి (ఔను.. ఆ పాత్రలకు ఆవిడ మహానటే) సూర్యాకాంతం. తర్వాత స్థానంలో అప్పటి నటుల్లో ఛాయాదేవి ఉన్నారు. అయితే, సూర్యాకాంతం వాస్తవానికి ఇంట్లోనే వంట చేసుకునేవారు. దీనికి ఆమెకున్న కుటుంబ ఆచారాలు, వ్యవహారాలు.. వంటివి కారణంగా మారాయి.
పైగా సూర్యాకాంతం భర్త పూర్తిగా ఇంటి వంటనే ఇష్టపడేవారట. అందునా.. ఆమె చేస్తేనే ఆయన తినేవా రట. దీంతో సూర్యాకాంతానికి వంట చేయడంలో బాగా అనుభవం ఉందనే పేరు ఉండేది. పైగా తెరమీద ఎంతో క్రూయల్‌గా కనిపించే సూర్యాకాంతం నిజ జీవితంలో మాత్రం.. ఎంతో సౌమ్యురాలు, శాంత స్వభావి అని.. పేరుంది. అయితే, కొన్నాళ్లకే ఆమె సినిమాల్లో బిజీ అయిపోయారు. ఒక దశకం (పదేళ్ల) లో అయితే.. సూర్యాకాంతానికి క్షణం తీరిక కూడా ఉండేది కాదు.
దీంతో భర్తను ఒప్పించి.. ఇంట్లో పనిమనిషిని పెట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో తెలిసిన వారికి కబురు పెట్టి.. మనిషిని చూడమన్నారు. అయితే ఫక్తు సంప్రదాయాన్ని పాటించే సూర్యకాంతం ఇంట్లో వంటకు ఎవరైతే బాగుంటుందని ఆలోచించిన రేలంగి వెంకట్రామయ్య(ఈయనే అప్పట్లో అందరకీ తల్లో నాలుకలా వ్యవహరించేవారు) ఎట్టకేలకు అన్నగారు ఎన్టీఆర్ సూచనల మేరకు విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన ఒక బ్రాహ్మణ మహిళలను తీసుకువచ్చారు.
అయితే, ఆమెకు.. ఎవరింట్లో వంట చేయాలో ముందుగా చెప్పలేదు. కేవలం మద్రాస్ రైల్వే స్టేషన్‌లో దిగితే.. డ్రైవర్ వచ్చి రిసీవ్ చేసుకుంటాడంటూ.. అప్పట్లోనే 500 రూపాయలు మనీ ఆర్డర్ చేశారు. ఇక, ఆమె చెంగుచెంగున మద్రాస్ రైల్వేస్టేషన్‌లో దిగిపోయారు. ఇంతలో డ్రైవర్ వచ్చాడు. ఈ క్రమంలో కారెక్కుతున్న ఆమె.. ఎవరింటికి బాబూ మనం వెళ్తోంది అని డ్రైవర్‌ను అడగగానే.. సూర్యాకాంతమ్మ గారి ఇల్లు అని సమాధానం చెప్పాడట.
అంతే.. ఎక్కేకారును కూడా దిగిపోయి.. వెంటనే మరుసటి ట్రైన్‌కు విజయవాడకు వెళ్లిపోయిందట ఆవిడ. ఓసినిమా షూటింగ్‌లో ఈ విషయం అన్నగారు చెప్పి.. సూర్యాకాంతం అత్తకు ఇంత పేరుందన్నమాట! అని ఆట పట్టించేవారట. అయితే.. తర్వాత.. అన్నగారే.. మరో మనిషిని తెప్పించి ఆమె ఇంట్లో వంటకు కుదిర్చారని..గుమ్మడి రాసిన పుస్తకంలో ఉంది.