సినిమాలంటే.. అన్నగారికి వల్లమాలిన అభిమానం. తనకు తిండిపెట్టిన వెండి తెర అంటే మక్కువ. అందుకే ఆయన మనసు పెట్టి సినిమాలు చేసేవారు. ఆయన నటించిన ఏ సినిమా అయినా.. ఏ సీన్ అయినా.. అన్నగారు మనసు పెట్టి చేసేవారు. ఇలా గతంలో చిరంజీవులు అనే సినిమాలో నటించే సమయంలో పెను ప్రమాదానికి గురయ్యే పరిస్థితిని తెచ్చుకున్నారు ఎన్టీఆర్.
చిరంజీవులు సినిమాలో అన్నగారు అంధుడిగా నటించారు. ఓ సీన్లో అన్నగారు రైలు ట్రాక్‌పై నడుస్తూ వెళ్తుంటారు. ఆయన వెనుక.. రైలు వస్తుంటుంది. దీనిని అన్నగారు పట్టించుకోరు. ఇంతలో దీనిని గమనించిన మరో క్యారెక్టర్ (గుమ్మడి) ట్రాక్‌పైకి పరుగు పరుగున వచ్చి.. అన్నగారిని పక్కకు నెట్టేస్తారు. ఇదీ సీన్. అంతా వివరించారు డైరెక్టర్. ఇక, సీన్ రెడీ అయింది. ట్రాక్‌పై అన్నగారు వెళ్తున్నారు. వెనుక రెండు కిలో మీటర్ల దూరంలో ఎక్స్‌ప్రెస్ (నిజంగానే. ఇప్పట్లో మాదిరిగా కృత్రిమం కాదు) వస్తోంది.
అయితే, అన్నగారు ఈ సీన్లో జీవించేశారు. ఇంతలో ట్రైన్ చేరువ అయిపోయింది. ఈ సీన్‌ను గమనించి న కేరక్టర్నటుడు(గుమ్మడి).. అన్నగారిని రక్షించేందుకు పరుగుపరుగున ట్రాక్ వద్దకు చేరుకోవాలి. ఆయన షూ తోపాటు సూట్ కూడా ధరించి ఉన్నారు. అలానే పరిగెట్టి అన్నగారిని రక్షించాలి. సీన్ షూటింగ్ జరుగుతోంది. గుమ్మడి పరుగు పెట్టడం ప్రారంభించారు.
అయితే, అనూహ్యంగా రైలు ట్రాక్ పక్కన ఉన్న కంకర రాయి బలంగా గుచ్చుకుని గుమ్మడి షూ స్లిప్ అయిపోయి.. కింద పడిపోయారు. షూటింగ్ చేస్తున్న దర్శకుడు, కెమెరామన్లు దూరంగా ఉండడంతో దీనిని గమనించలేదు. మరోవైపు.. ట్రైన్ వచ్చేస్తోంది. దీనిని అన్నగారు ఏమాత్రం గమనించకుండా ముందుకు చూస్తూ.. నడిచి వెళ్లిపోతున్నారు.
ఒకే ఒక్క క్షణం కనుక గుమ్మడి లేచి పరిగెట్టి.. అన్నగారిని పక్కకు లాగేసి ఉండకపోతే.. ఖచ్చితంగా పెను ప్రమాదం జరిగి ఉండేదని.. ఎన్టీఆర్ అంకిత భావం అంటే అలా ఉండేదని గుమ్మడి రాసుకున్నారు. అలా ఎన్టీఆర్‌కు నటన పట్ల ఉన్న అంకితభావం ఆయన్ను మరణం అంచులకు తీసుకువెళ్లి వచ్చింది.