రమణారెడ్డి. నేటి తరానికి కనీసం పేరు కూడా పరిచయం లేదు. ఒకప్పటి హ్యాస్య నటుల్లో రెండు దశాబ్దాల పాటు ధ్రువతారగా వెలిగిపోయిన నెల్లూరు జిల్లాకు చెందిన.. నటుడు. ఆరు అడుగులు ఉన్నా.. శరీర సౌష్ఠవం పెద్దగా లేకున్నా.. తన ముఖ కవళికలు.. హావభావాలు వంటి వాటితో…ఆయన తెలుగు ప్రజలను మెప్పించారు. రమణారెడ్డి చాలా తక్కువ పారితోషికం తీసుకునేవారనే పేరుంది. ఆయనకు భయం ఎక్కువట. తను సినిమాల్లో పనిచేయకపోతే.. ఇక, బయట ఉపాధి చూసుకోలేనని అనుకునేవారట.
అందుకే ఆయన తక్కువ రెమ్యునరేషన్ తీసుకుని ఎక్కువ సినిమాల్లో చేశారని అప్పటివారు చెప్పుకొనేవారు. పైగా.. ఆయన అందరికీ తలలో నాలుకగా ఉండేవారని.. యునాని వైద్యం చదివారని.. కూడా అంటారు. పెద్దగా.. ఆర్భాటాలకు పోకుండా.. ఉన్నదానిలో సంతృప్తి వ్యక్తం చేసేవారుగా రమణారెడ్డికి పేరుంది. అయితే.. ఎన్టీఆర్ కన్నాముందుగానే రమణారెడ్డి తెలుగు తెరకు పరిచయం అయ్యారు. కానీ, ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే.. ఆయన సుడి తిరిగిందని అంటారు. ఎన్టీఆర్‌కు ఆయనకు ఎక్కడో కెమిస్ట్రీ కుదిరింది.
దీంతో ఇద్దరూ కూడా.. షూటింగ్ సమయంలో వచ్చిన గ్యాప్‌లో మాట్లాడుకునేవారు. అంతేకాదు.. రమణారెడ్డి శైలికి ఎన్టీఆర్ ముగ్ధులయ్యేవారు. రమణా రెడ్డి టీలు, కాఫీలు తాగేవారు కాదు. కేవలం ఆయన పొగాకు పీల్చేవారట. ఇలా.. రమణారెడ్డి స్టయిలే వేరుగా ఉండేదని అనేవారు. ఎన్టీఆర్ తో పరిచయం తర్వాత.. రమణారెడ్డి కూడా రెమ్యునరేషన్ పెంచారు. ఆయన ప్రోత్సాహంతో మద్రాస్‌లోనే ఒక ఇల్లు కూడా నిర్మించుకున్నారు.
అంతేకాదు.. వ్యాపారంలో పెట్టుబడులు కూడా పెట్టాలని అనుకున్నారట. కానీ, ఈ విషయంలో రమణారెడ్డి వెనక్కి తగ్గేలా చేసి.. అప్పటి మరో హాస్య నటులు.. (పేరు చెబితే బాగుండదు) ఈ వ్యాపారంలోకి ప్రవేశించారు. ఇది సూపర్ సక్సెస్ అయింది. ఇలా.. ఎన్టీఆర్ తను ఎదుగుతూనే.. తను నమ్మిన వారిని ఎదిగేలా చేశారనడంలో సందేహం లేదు.