సూపర్‌స్టార్ కృష్ణ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇక కృష్ణ రికార్డులు మాత్రమే పదిలంగా ఉంటాయి. ఆయన్ను ఇక చూడలేం. కృష్ణకు ముందు నుంచి నిర్మాతల హీరో, ప్రయోగాల హీరోగా పేరుంది. కొల్లేటి కాపురం సినిమాతో తెలుగులో తొలి ఆర్ వో టెక్నాలజీ వచ్చింది. అలాగే ఆయన నటించిన గూడుపుఠాణి మొదటి ఓఆర్‌డబ్ల్యూ కలర్ సాంకేతికతతో వచ్చిన సినిమాగా రికార్డుల్లో నిలిచిపోయింది.
అలాగే కృష్ణ నటించిన భలేదొంగలు తొలి తెలుగు ఫ్యూజీ కలర్ సినిమా. ఇక సింహాసనం తెలుగులోనే తొలి 70ఎంఎం సినిమా. అలాగే ఇదే సింహాసనం సినిమాకు తొలిసారిగా తెలుగులో స్టీరియోఫోనిక్ 6 ట్రాక్ సౌండ్ టెక్నాలజీ వాడారు. అల్లూరి సీతారామరాజు తెలుగులో తొలి ఫుల్‌స్కోప్ సినిమాల్లో ఒకటి. అలాగే ఏఎన్నార్ చేసిన దేవదాసు మళ్లీ చేయడం, ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ సినిమాకు పోటీగా కురుక్షేత్రం చేయడం ఆయన చేసిన సాహసోపేత సినిమాలు.
ఇక అప్పటి అగ్ర హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ ను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ కృష్ణకు ఉండేది. ఇక కృష్ణకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. కృష్ణ ఎక్కువుగా కుటుంబ కథా సినిమాల్లో నటించారు. అందుకే ఆయనకు మహిళా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువుగా ఉండేది. ఆ రోజుల్లో ఆయన్ను చూసేందుకు తెలుగు నాట నుంచి కృష్ణ అభిమానులు చెన్నై రైళ్లలో వెళ్లి ఆయన ఇంటి దగ్గర పడిగాపులు కాచేవారు. అప్పట్లోనే ఏ హీరోకు లేనట్టుగా కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉన్నాయి.
ఇక సంక్రాంతి సినిమాల విషయంలోనూ కృష్ణ రికార్డు క్రియేట్ చేశారు. సంక్రాంతికి కృష్ణ నటించిన 30 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందుకే సంక్రాంతి హీరోల్లో ఒకరిగా ఆయన నిలిచిపోయారు. 40 సంవత్సరాల సినీ కెరీర్‌లో కృష్ణ నటించిన 30 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. ఏఎన్నార్ 33 , ఎన్టీఆర్ 31 సినిమాల తర్వాత కృష్ణే సంక్రాంతి టాప్ హీరోల్లో మూడో స్థానంలో నిలిచారు.
అయితే కృష్ణ నటించిన సినిమాలు వరుసగా 21 ఏళ్ల పాటు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. 1976 నుంచి 1996 వరకు ప్రతి యేటా కృష్ణ సినిమా సంక్రాంతికి వచ్చింటి. ఈ రికార్డు స్టార్ దిగ్గజ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్‌కు కూడా లేదు. ఇక 1964 – 95 మధ్య ఆయన యేడాదికి 10కుపైగా సినిమాల్లో నటించారు. ఒక్కోసారి రోజుకు ఆయన 18 గంటల పాటు కంటిన్యూగా పనిచేసేవారు.