సూపర్‌స్టార్ కృష్ణ ఒకటికాదు రెండు కాదు ఐదు దశాబ్దాల పాటు తిరుగులేని నటశిఖరంగా ఎదిగారు. కృష్ణ మనలను విడిచి వెళ్లిపోయినా ఆయన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటకి మనలను వెంటాడుతూనే ఉంటాయి. రెండు నెలల వ్యవధిలోనే భార్యభర్తలు ఇద్దరూ మృతిచెందడం ఘట్టమనేని ఫ్యామిలీకి, ఇటు ఆ కుటుంబ అభిమానులకు తీరని లోటే. ఇక కృష్ణ జీవితం ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు.
ఆయన జీవితంలో జరిగిన ఓ అరుదైన సంఘటన అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఆయన ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి నేరుగా ఫోన్ చేసి తన కుమార్తె పెళ్లికి రావొద్దని చెప్పడం విచిత్రమే. మరి ఆ ఇంట్రస్టింగ్ స్టోరీ ఏంటో చూద్దాం. కృష్ణ పెద్ద కుమార్తె పద్మావతి పెళ్లి జయదేవ్‌తో చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్నారు. జయలలిత – కృష్ణ మంచి స్నేహితులు. వీరిద్దరి కాంబినేషన్లో గూఢాచారి 116 – నిలువుదోపిడి సినిమాలు వచ్చాయి.
ఇక తన పెద్ద కుమార్తె పద్మను గల్లా జయదేవ్‌కు ( అప్పటికే జయదేవ్ ఫ్యామిలీకి కాంగ్రెస్‌లో రాజకీయంగా మంచి పలుకుబడి ఉంది) ఇచ్చి పెళ్లి నిశ్చయించారు. నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంతో మంది రాజకీయ, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పెళ్లికి వచ్చారు. కృష్ణ కూడా తన తోటి హీరోయిన్లు అందరిని ఈ పెళ్లికి ఇన్వైట్ చేశారు. జయలలిత వద్దకు స్వయంగా వెళ్లి మరీ పెళ్లి కార్డు ఇచ్చారు. జయకూడా తప్పకుండా వస్తానని కృష్ణకు మాట ఇచ్చారు.
అయితే పెళ్లి మూడు రోజుల్లో జరుగుతుందనగా కృష్ణ సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి సీఎం వస్తుండడంతో పెళ్లి మండపానికి ముందు ఉన్న మూడు వరుసలు భద్రత నేపథ్యంలో సీఎంకే ఇవ్వాలని కండీషన్ పెట్టారట. కృష్ణ కుదరదని.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సినిమా వాళ్లు వస్తున్నారని చెప్పారట.
దీంతో కృష్ణ స్వయంగా జయలలితకు ఫోన్ చేసి పరిస్థితి వివరించారట. దీంతో కృష్ణ బాధ అర్థం చేసుకున్న ఆమె పెళ్లికి రానని చెప్పారట. అయితే పెళ్లి రోజు తన పేరిట నూతన దంపతులను ఆశీర్వదిస్తూ ఓ బొకే పంపారట. ఈ విషయం అప్పట్లో ఓ సంచలనం అయ్యింది.