ఇది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తోంది. అదేంటి ? అన్నగారు ఎన్టీఆర్ పరమపదించి.. ఏళ్లు దాటింది కదా ! ఇప్పుడెందుకు ? అంటారా ? ఇటీవల రెండు రోజుల కిందట ఒక ఫొటో మీడియాలో చక్కర్లు కొట్టింది. కత్తి కాంతారావు.. అనే ప్రముఖ నటుడు (నేటి తరానికి తెలియదు కదా!) ఈ భూమిపై పుట్టి 100 సంవత్సరాలు. ఈ సందర్భంగా ఆయన కుమారులు.. శతజయంతిని నిర్వహించారు. దాదాపు 400 సినిమాల్లో నటించిన (అంటారు) ఆయన అనేక సినిమాలకు గండపెండేరం వేయించుకున్నారు. (ఇది నిజం)
ఒక దశకంలో అన్నగారికి పోటీగా.. జానపద చిత్రాలను ఏలిన ఘనాపాటి. అయితే, శత జయంతి సంద ర్భం గా వెలుగు చూసిన విషాదం (అభిమానులు ఇలానే అంటున్నారు) ఏంటంటే.. ఒక రెండు సాధారణ కుర్చీల్లో కాంతారావు ఫొటోలను పెట్టి.. అటొక కొడుకు, ఇటొక కొడుకు.. కూర్చుని.. ఎదరుగా డజను అరటి పళ్లు పెట్టి నివాళి అర్పించి.. శత జయంతికి నమస్కారం పెట్టారు. ఈ సీన్ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అయ్యింది. అసలు ఈ స్థితి చూసిన చాలా మంది ఎంతో ఆవేదన చెందారు.
మరి ఎన్నో హిట్లు కొట్టిన కాంతారావు బాగా బతికిన రోజుల్లో రూపాయి వెనుకేసుకోలేదు కదా ? మరో ప్రతినాయక పాత్రధారి.. ఇప్పుడు ఈయనను అసలు అందరూ మరిచిపోయారు. ఆయనే రాజనాల. ఈయన పరిస్థితి ఇంత కన్నా ఘోరం. ఎవరూ అసలు జయంతులు.. వర్థంతుల మాటే ఎత్తని పరిస్థితి..! దీనికి కారణం ఏంటి? ఎందుకు.. అన్నగారికి వీరికి లింకు వచ్చింది? అంటే… వీరిద్దరూ కూడా అన్నగారితో పాటు.. సినిమాల్లో దూసుకుపోయారు. అనేక చిత్రాల్లో కలిసి నటించారు.
అన్నగారిని అన్నగారని పిలిచింది కూడావాళ్లే. అయితే.. అన్నగారిని అన్నగారుగానే చూసినా.. ఆయన తన జీవితంలో అవలంబించిన ఆర్థిక నియంత్రణను వీరు విస్మరించారు. ఎన్నిసార్లు చెప్పినా.. పెడచెవిన పెట్టారు. రూపాయి ఖర్చు పెట్టే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసుకోవాలని ఎన్టీఆర్ ఎంత చెప్పినా వీరు వినేవారే కాదు. అందుకే..నేడు.. చరిత్రలో కలిసి పోయారు!! ఇదే వీరికి-అన్నగారికి మధ్య సంబంధం!!