Moviesఎన్టీఆర్‌కు ఆ స్టార్ హీరోయిన్ కోడ‌లు కాని కోడ‌లు అన్న విష‌యం...

ఎన్టీఆర్‌కు ఆ స్టార్ హీరోయిన్ కోడ‌లు కాని కోడ‌లు అన్న విష‌యం తెలుసా…!

అదేంటి.. అని అనుకుంటున్నారా? నిజ‌మే. సీనియ‌ర్ ఎన్టీఆర్‌.. చిత్ర ప‌రిశ్ర‌మ‌తో అంత‌గా అనుబంధం పెంచుకున్నారు. చిత్తూరు నాగ‌య్య‌ను `నాన్న‌` అని పిలిచిన‌ట్టే.. అప్ప‌టి సీనియ‌ర్ న‌టి ఎల్‌. విజ‌య‌లక్ష్మిని అన్న‌గారు `కోడ‌లా` అని పిలిచేవార‌ట‌. ఎందుకంటే.. బ్లాక్ బ్ల‌స్ట‌ర్ మూవీ.. ‘నర్తనశాల’లో బృహ‌న్న‌ల పాత్ర ధారి అయిన అన్న‌గారికి ఈమె కోడలిగా నటించారు! దాని తరువాత ఆయ‌న ఎప్పుడు విజ‌య‌ల‌క్ష్మి క‌నిపించినా.. ‘కోడలా…’ అని పిలిచేవారు. అదే త‌ర్వాత క‌లంలో ఆమె పేరు అయిపోయింది. ఇటీవల ఓ టీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మి ఈ ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు.

“ఎన్టీఆర్‌తో నాకు చాలా మధుర జ్ఞాపకాలున్నాయి. ‘నర్తనశాల, పరమానందయ్య శిష్యుల కథ, మంగమ్మ శపథం, పాండవ వనవాసం, రాముడు భీముడు’… ఇలా చాలా ఉన్నాయి. ఆయనతో చేసిన ప్రతిసారీ ఓ థ్రిల్‌ ఉంటుంది. రామారావు గారు క్రమశిక్షణగా ఉంటారు. ఉదయం ఏడంటే ఏడింటికల్లా సెట్‌లో కనిపిస్తారు. ఆ క్రమశిక్షణ, పని పట్ల అంకితభావం… ఆయన నుంచే నేర్చుకున్నా. అన్నిటికంటే పెద్ద స్టార్‌నన్న భావన ఆయనలో కనిపించదు. ఎన్టీఆర్‌ నుంచి ఎన్నో నేర్చుకున్నా. ఆయనలా ఒకటి తరువాత ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటా.“ అని విజ‌య‌ల‌క్ష్మి వివ‌రించారు.

ఇక‌, బ‌జ్జీల విష‌యాన్ని వివ‌రిస్తూ.. ఆస‌క్తిక‌ర అంశాల‌ను ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మి పంచుకున్నారు. “ఎన్టీఆర్‌.. తాను హిట్‌ పెయిర్‌. కలిసి చాలా సినిమాలు చేశాం. తొలిసారి ఆయనతో నటించేటప్పుడు భయపడ్డాను. అప్పటికే ఆయన పెద్ద స్టార్‌. నేను అప్పుడప్పుడే వస్తున్నాను. అందులోనూ మా ఇంట్లో ఎవరూ సినీ ఫీల్డ్‌కు సంబంధించినవారు లేరు. దాంతో మొదటిసారి సెట్‌కు వెళ్లినప్పుడు చాలా భయపడ్డాను. కానీ ఆయన నన్ను ‘రామ్మా… కూర్చోమ్మా’ అంటూ ఆప్యాయంగా పలకరించారు. ఆ తరువాత నుంచి భయం పోయింది“ అని వివ‌రించారు.

“‘నర్తనశాల’లో రామారావు గారు వేసిన బృహన్నల పాత్ర నా గురువు. అందులో అద్భుతంగా చేశారు. ఇచ్చిన పాత్రకు రెండొందల శాతం న్యాయం చేస్తారాయన. రామారావు గారు చూడ్డానికి గంభీరంగా కనిపిస్తారు కానీ సెట్‌లో చాలా సరదాగా ఉంటారు. అప్పట్లో కారవాన్లూ అవీ లేవు. షూటింగ్‌ గ్యాప్‌లో అందరం చెట్టు కింద కూర్చొనేవాళ్లం. అప్పుడు ఆయన ‘ఏయ్‌… పచ్చిమిరపకాయ బజ్జీలు తెండి’ అనేవారు. అందరం సరదాగా కబుర్లు చెప్పుకొంటూ ఆ బజ్జీలు తినేవాళ్లం. “కోడ‌లు కాని కోడ‌లుతో బ‌జ్జీలు తింటున్నానండి!“ అని ఎన్టీఆర్ చ‌మ‌త్క‌రించేవారు“ అని విజ‌య‌ల‌క్ష్మి వివ‌రించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news