కోలీవుడ్ హీరోలు, హీరోయిన్లు వరుసగా ప్రేమలో మునిగితేలుతూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. నిన్నటికి నిన్న హీరో విశాల్ ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని.. వారిద్దరూ పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. కోలీవుడ్ యంగ్ హీరో గౌతమ్ కార్తీక్, ప్రముఖ హీరోయిన్ మంజిమా మోహన్ తో ప్రేమలో ఉన్న విషయం కూడా బయటికి వచ్చింది. వీరిద్దరూ కూడా త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని ఇప్పటికే సహజీవనం కూడా చేస్తున్నారన్న వార్తలు వచ్చాయి. హీరోయిన్ మంజిమా కూడా తాము పీకల్లోతు ప్రేమలో ఉన్నామని ప్రకటించింది.
ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కూడా పెళ్లి వార్త మోసుకొచ్చింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు. గత 20 సంవత్సరాలుగా సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమను తన అందచందాలతో ఓ ఊపు ఊపేస్తున్న యాపిల్ బ్యూటీ హన్సిక మోత్వాని. హన్సిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. డిసెంబర్ 4వ తేదీన హన్సిక తన ప్రియుడుతో మూడు ముళ్ళు వేయించుకోబోతోంది. ఇంతకు ఆమెకు కాబోయే భర్త ఎవరో తెలుసా? అతడి పేరు సోహైల్ కటారియా.
35 ఏళ్ల వయస్సులో ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతోన్న హన్సికకు గతంలో చాలా ప్రేమలో పెటాకులు అయ్యాయి. ముందుగా హన్సిక కోలీవుడ్ హీరో శింబుతో బ్రేకప్ తర్వాత మరో కోలీవుడ్ యంగ్ హీరో జయం రవితో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి. జయం రవి, హన్సిక కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని వార్తలు వచ్చాయి. అయితే అప్పటికే జయం రవికి పెళ్లి అయిపోయింది. ఆ తర్వాత హన్సిక ప్రస్తుత తమిళనాడు ఎమ్మెల్యే, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తో కూడా ప్రేమాయణం నడిపిందని వార్తలు వచ్చాయి.
ఇలా ఆమె కెరీర్లో మూడు ప్రేమలు పెయిల్ అయ్యాయి. సోహైల్ – హన్సిక ముందు నుంచి మంచి స్నేహితులు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి చాలా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. ఆ వ్యాపారాలను విస్తరించే క్రమంలో ఇద్దరు ప్రేమలో పడిపోయారు. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసింది హన్సిక-సోహైల్ జంట. ఇక తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ వచ్చే డిసెంబర్ 4వ తేదీన జైపూర్ లోని పురాతన ప్యాలెస్ లో పెళ్లి చేసుకోబోతున్నారు.
ఇప్పటికే వీరు స్టార్ హోటల్ తో పాటు రిసార్ట్ కూడా బుక్ చేసినట్టు తెలిసింది. అయితే హన్సిక ఈ పెళ్లిని ఇండస్ట్రీ వాళ్లకు దూరంగా కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే చేసుకోబోతుందట. పెళ్లి తర్వాత కూడా హన్సిక సినిమాల్లో నటించే అవకాశం ఉంది. హన్సిక ప్రస్తుతం నటించిన `మై నేమ్ ఇస్ శృతి`, 105 , పార్ట్నర్ సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. అలాగే మరో ఐదు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అందుకే పెళ్లి తర్వాత కూడా తన కెరీర్ కొనసాగించాలని హన్సిక ప్లాన్ చేసుకుంటుందట.