అన్నగారు సినీ రంగంపై వేసిన ముద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ సినిమా అంటే.. చాలు.. అది ఏదైనా కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా థియేటర్లకు ప్రజలు క్యూ కడతారు. దీంతో నిర్మాతలకు కాసుల వర్షమే అనే పేరు ఉండేది. ఇక, సావిత్రి – ఎన్టీఆర్ జోడీకి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వీరు నటించిన సాంఘిక సినిమాలకు.. పౌరాణిక, జానపద సినిమాలకు.. ఎనలేని ఆదరణ లభించింది.
అన్నగారు-సావిత్రి.. కేవలం హీరో హీరోయిన్లుగా మాత్రమే కాదు.. అన్నా చెల్లెళ్లుగా కూడా నటించారు.
రక్తసంబంధం సినిమాలో ఎన్టీఆర్‌కు సావిత్రి సోదరిగా నటించి రక్తికట్టించారు. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఇలా.. సావిత్రి-ఎన్టీఆర్ జోడీకి తెలుగు, తమిళనాడు ప్రజలు.. ప్రేక్షకులు.. కూడా బ్రహ్మరథం పట్టారు.
ఇక, సావిత్రి తర్వాత.. ఆ రేంజ్‌లో అన్నగారి సరసన నటించి మోత మోగించిన హీరోయిన్లు ఉన్నారా ? అంటే.. జయలలిత గుర్తుకు వస్తారు. జయలలితతో అన్నగారి జోడీకి ఎంతో క్రేజ్ ఉంది. వారిద్దరు నటించిన సినిమాలు కూడా సూపర్ హిట్ కొట్టాయి. పౌరాణికం, సాంఘికం, సామాజికం ఇలా.. అన్ని కోణాల్లోనూ.. జయలలిత దుమ్ము రేపారు. దీంతో ఈ ఇద్దరు నటించిన సినిమాలు కూడా.. హిట్టయ్యాయి. తమిళంలో కూడా దుమ్మురేపాయి.
మరీ ముఖ్యంగా అన్నగారు కృష్ణుడిగాను, జయలలిత సత్యభామ, రుక్మిణి వేషాల్లో వేసిన చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అందుకే, జయలలిత – ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే బళ్లు కట్టించుకునిమరీ ప్రేక్షకులు వచ్చేవారట. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. అలా సినిమాల నుంచి రాజకీయాల వరకు కూడా వీరి అనుబంధం అప్రతిహతంగా కొనసాగింది.