అవును…! కాలం యాదిలో పడలేని జీవులం అయిపోయాం. నిన్నటిది ఈ రోజుకే మరిచిపోయి.. రేపటి కోసం పరుగులు పెట్టేస్తున్నాం. కానీ, ఒక్కసారి ఈ పరుగు ప్రయాణంలో ఆగి.. ఒక్క పది నిముషాలు గతం గురించి తలుచుకుంటే.. మనం మరిచిపోయిన.. మరిచిపోతున్న అనేక సంగతులు.. మనసుపు పట్టి లేపుతాయి. ఇలాంటి జ్ఞాపకం కూడా ఒకటి ఉందా?! అని కళ్లు చెమర్చుతాయి. సూర్యకాంతం. వెండి తెరపై.. అనేక మంది నటీమణులు వచ్చారు. పోయారు.
కానీ.. కెరీర్ ప్రారంభించిన 1924 నుంచి ఇక, చరమాంకం వరకు అంటే.. 1994-95 వరకు వెండి తెరను ఏలిన వారు.. అతితక్కువ మందే ఉన్నారు. ఉన్నా.. మధ్యలో గ్యాప్‌లు.. విరామ చిహ్నాలు.. ఫుల్ స్టాప్‌లు కూడా పడ్డాయి. కానీ, గయ్యాళి అత్తగా గుర్తింపుపొందిన డాక్టర్ సూర్యాకాంతం మాత్రం విరామాలకు తావిద్దామన్నా.. ఊపిరి సలపని రీతిలో మేకప్ వేసుకున్నారు. నిన్నటి మొన్నటి తరం నచ్చి.. మెచ్చిన ఈ నటనా విదుషీమణిని నేటి తరం గుర్తించలేకపోవచ్చు.
కానీ, ఆమె పుట్టిన కాకినాడ.. పెరిగిన చెన్నై.. ఉన్నా హైదరాబాద్ ఇలా ఈ మూడు ప్రాంతాలే కాదు.. తాను తిరిగిన విజయవాడ, విశాఖపట్నంలోనూ.. సూర్యకాంతం నిర్మించిన సత్రాలు, స్కూళ్లు.. నేటికీ ఎంతో మందికి సేవలు అందిస్తున్నాయి. ఆమె నవ్వరు.. ఏడిపిస్తారు..! అనేముద్ర వేసుకుందికానీ.. ఒక్కసారి ఆమె జీవితాన్ని తరచిచూస్తే.. కన్నీటి చుక్క కాదు కదా.. కన్నీరు అనే మాట కూడా వినిపించదు.
ఎందుకంటే.. అంత గొప్పగా బతికిందావిడ. తనచుట్టూ ఉన్నవారిని కూడా బతికించిందావిడ!
ఒక నటిగానేకాదు.. సంఘ సంస్కర్తగా.. చెన్నైలో భర్తలు చనిపోయిన 15 మంది మహిళలకు ఒకే వేదికపై వివాహాలు చేసిన ఘనత గయ్యాళి అత్త సొంతం చేసుకుందంటే.. ఆమె గయ్యాళి అనగలమా?! ఆ పాత్రలో నటించిందంతే.. జీవించిందంతా.. ఆనందంలోనే..! అప్పటి మద్రాసు హైకోర్టు జడ్జిని వివాహం చేసుకున్న సూర్యకాంతం కోసం భర్త కారులో స్టూడియోల ముందు వెయిట్ చేసిన సందర్భాలు.. ఎంత మందికి దక్కుతాయి. పార్థివ దేహాన్ని దర్శించుకునేందుకు పల్లెలు పరుగులు పెట్టిన సందర్భాలు ఎందరికి లభిస్తాయి!! అయినా.. గయ్యాళే.. కానీ, మనసు పెట్టేసేది..మనం మాత్రం మరిచిపోయాం!