మహానటి సావిత్రితో ఎన్టీఆర్ చేసిన పదుల సంఖ్యలో సినిమాలు హాట్ కేకుల్లా బాక్సాఫీస్ వద్ద అమ్ముడు పోయాయి. మంచి కలెక్షన్లు కూడా దక్కించుకున్నాయి. ఎన్టీఆర్ – సావిత్రి కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్. అదేంటో గాని మహిళా ఫ్యాన్స్ అయితే వీరి కాంబినేషన్ సినిమాలకు క్యూ కట్టేవారు.
అయితే, మహానటి.. కొన్నాళ్లకు ఇబ్బందుల్లో పడిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో తమిళ చిత్ర పరిశ్రమ ఆమెకు అండగా నిలిచిందనే చర్చ ఉంది. అదేసమయంలో సావిత్రికి అండగా తెలుగు పరిశ్రమ నుంచి కొందరు మాత్రమే అండగా ఉన్నారని అంటారు. ప్రధానంగా సావిత్రితో కలిసి నటించి అనేక చిత్రాల్లో విజయవంతమైన గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు మాత్రం.. ఆమెను ఆదుకోలేదనే వాదన ఉంది. కానీ, ఇది నిజం కాదని గుమ్మడి తన పుస్తకంలో పేర్కొన్నారు.
“సావిత్రి తొలిదశలో మెట్లపై నుంచి పడిపోయి ఆసుపత్రిలో ఉన్నారన్న విషయం.. మా పీఏ చెప్పాడు. నేను వెంటనే ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి చెప్పాను. అప్పటికి ఆయన బెంగళూరులో షూటింగులో ఉన్నాడు. విషయం తెలిసి.. మద్రాస్‌లోని తన ఇంటి నుంచి స్టెనోను ఒకామెను సావిత్రికి పంపిస్తానని చెప్పారు“ అని గుమ్మడి రాసుకున్నారు. ఆ తర్వాత.. కూడా ఎన్టీఆర్ పలు మార్లు తనకు ఫోన్ చేసి సావిత్రి ఆరోగ్యాన్ని వాకబు చేసినట్టు చెప్పారు.
అయితే.. దీనిపై కొన్ని అప్పటి సినీ పత్రికలు సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు.. సావిత్రిని పట్టించుకోలేదని .. అంటూ..వార్తలు రాశాయని గుమ్మడి తెలిపారు. అయితే, ఈ పత్రికల వ్యవహారం ఎన్టీఆర్ కు తెలియదని, తెలిసినా.. ఎన్టీఆర్ పట్టించుకునే వారు కాదని గుమ్మడి పేర్కొన్నారు. అనేక సందర్భాల్లో సావిత్రి గురించి తెలిసి.. అన్నగారు బాధపడేవారని.. `చక్కని జీవితం.. ` అని వ్యాఖ్యానించేవారని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ కాని, ఏఎన్నార్ కాని సావిత్రిని ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించేవారు. ఈ రోజు అవసరం ఉన్నా లేకపోయినా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తే రేపు ఛాన్సులు తగ్గాక రూపాయి ఎలా ? వస్తుందని చెప్పినా ఆమె పెడచెవిన పెట్టేవారు. దీనికి తోడు గుప్తదానాలు, ఆమెకు ఉన్న వ్యసనాలు కూడా ఆమె ఆర్తికంగా చితికిపోవడానికి కారణమయ్యాయి.