`నర్తన శాల` ఈ సినిమా గుర్తుందా? అప్పుడప్పుడు.. ఓ ఛానెల్‌లో ఈ సినిమా మనలను పలకరిస్తూనే ఉంది. అందరూ దిగ్గజ నటులే. ఎస్వీ రంగారావు, సావిత్రి, అన్నగారు. అబ్బో.. ఈ కాంబినేషన్ అదిరిపోయింది. 100, 200 రోజులు.. ఆడేసి.. కాసుల వర్షం కురిపించేసింది కూడా! అయితే.. ఈ సినిమా తర్వాత.. ఇందులో నటించిన నటీనటులకు ఇబ్బందులు తప్పలేదు. ముఖ్యంగా ఈ మూవీలో బృహన్నలగా వేషధారి అన్నగారి పరిస్థితి మరింత!
కొన్ని కొన్ని విషయాలు చెబితే నమ్మరు కానీ, అసలు మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో ఎన్టీఆర్ ఇలా బృహన్నల వేషం వేయడం ఏంటని.. అప్పట్లో చర్చ కూడా సాగింది. మరి అన్నగారికి మాత్రం తెలియదా? పేడి వేషం వేయడం ఆయనకు మాత్రం ఇష్టమా?! కానీ, దర్శకుడు కమలాకర కామేశ్వరరావు ఒత్తిడితో రాజ్యం పిక్చర్స్‌పై ఉన్న నమ్మకంతో ఎన్టీఆర్ దీనిని పూర్తి చేశారు. అయితే.. అప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన చిత్రాలకు ఇది భిన్నం కావడం గమనార్హం.
అయినా.. జనాలు మాత్రం హారతులు పట్టారు. కట్ చేస్తే.. అప్పటి వరకు ఉన్న ఎన్టీఆర్ ఇమేజ్ వేరు.. నర్తనశాల తర్వాత వచ్చిన ఇమేజ్ వేరు. దీంతో తర్వాత వచ్చిన సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు. నష్టాలు అయితే రాలేదు.. కానీ, అనుకున్నట్టు పోలేదు. ఈ విషయాన్ని తర్వాత కాలంలో గుర్తించిన ఎన్టీఆర్ వెంటనే ఓ రెండేళ్లపాటు సాంఘిక సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి ఆయన మళ్లీ పుంజుకున్నారట.
ఏదేమైనా.. కొన్ని కొన్ని పాత్రలు ఇంతే. ఇటీవల పరమపదించిన సూపర్ స్టార్ కృష్ణకు, 2004లో మన నుంచి దూరమైన శోభన్‌బాబుకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. కృష్ణ నటించిన అల్లూరి సీతారామ రాజు తర్వాత.. ఆయన నటించిన సినిమాలు అంతగా ఆడలేదు. శోభన్‌బాబు నటించిన సంపూర్ణ రామాయణం (రాముడు పాత్ర) తర్వాత.. ఇదే పరిస్థితి ఎదురైంది. అయినా.. తట్టుకుని నెట్టుకొచ్చారు.