అతిలోక అందాల సుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు సినీ ప్రేమికులు, తెలుగు సినిమా మేకర్స్ శ్రీదేవికి తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టారు. 1980వ దశకంలో శ్రీదేవి అంటే తెలుగు సినీ లవర్స్ పడి చచ్చేవాళ్లు. అసలు ఒక సినిమాలో శ్రీదేవి ఉందంటే ఆ సినిమా సూపర్ హిట్ అన్నంతటాక్ వచ్చేసింది. స్టార్ హీరోలు సైతం శ్రీదేవి తమ సినిమాల్లో కచ్చితంగా ఉండాలని రికమండే చేసి మరి దర్శకులపై ఒత్తిడి చేసి పెట్టించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పట్లో స్టార్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్ – ఏఎన్నార్ – సూపర్ స్టార్ కృష్ణ, చంద్రమోహన్, కృష్ణంరాజు ఇలా అందరితోనూ శ్రీదేవి నటించిన సూపర్ హిట్లు కొట్టింది.
ఆ తర్వాత తరం హీరోలుగా ఉన్న చిరంజీవి – నాగార్జున – వెంకటేష్ పక్కన కూడా శ్రీదేవి జోడి కట్టింది. ఆంధ్రుల అతిలోకసుందరి అన్న బిరుదు శ్రీదేవికి స్థిరపడిపోయింది. ఎప్పుడు అయితే శ్రీదేవి బాలీవుడ్ లోకి ఎంటర్ అయిందో అక్కడ నుంచి ఆమె వెనక్కు తిరిగి చూసుకోలేదు. ఆమె నేషనల్ హీరోయిన్ అయిపోయింది. శ్రీదేవి అందానికి బాలీవుడ్ సినీ లవర్స్ అందరూ ఫిదా అయిపోయారు. బాలీవుడ్లోకి వెళ్ళాక శ్రీదేవి దక్షిణాది సినిమాల్లో నటించేందుకు మరీ అంత ఆసక్తి చూపించలేదు.
బాగా పేరన్న హీరో అయితేనో లేదా… తనకు కావలసిన దర్శక, నిర్మాతల సినిమాల్లో మాత్రమే ఆమె ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని మరి నటించిందే తప్ప తెలుగు, తమిళ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించలేదు. శ్రీదేవి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యాక మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేసే క్రమంలో ఆమెకు ఇగో సమస్య వచ్చింది. ఇది శ్రీదేవి సొంత సినిమా. తన తల్లిని నిర్మాతగా పెట్టి శ్రీలత మూవీస్ బ్యానర్ పై కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా తీయాలని డిసైడ్ అయ్యారు.
ఈ సినిమాలో చిరంజీవి హీరో..! శ్రీదేవి తన సొంత బ్యానర్లో సినిమా చేయమని అడగడంతో చిరు వెంటనే ఓకే చెప్పేశారు. యండమూరి వీరేంద్రనాథ్ ఈ సినిమాకు కథ అందించారు. అంతకుముందే చిరు శ్రీదేవి కాంబోలో మోసగాడు, రాణికాసుల రంగమ్మ సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందు నుంచే చిరు – శ్రీదేవి ఇద్దరూ ఈగోలకు పోయారు. రచయిత యండమూరి 20 కథలు చెప్పారట. ఓ కథలో హీరో రోల్ డామినేషన్ అని శ్రీదేవి అభ్యంతరం చెపితే.. మరో కథలో హీరోయిన్ రోల్ డామినేషన్ అని చిరు అభ్యంతరం చెప్పేవారట.
చివరకు 20 కథలు విన్నాక కూడా చిరు, శ్రీదేవి కథను ఫైనలైజ్ చేయలేదు. శ్రీదేవి నిర్మాత కావడంతో ఆమె తన రోల్ ఎక్కువుగా ఉండాలని పదే పదే డైరెక్టర్ కొదండ రామిరెడ్డిపై ఒత్తిడి చేసేవారట. ఈ సినిమాకు వజ్రాలదొంగ అన్న టైటిల్ పెట్టారు. ఓ పాట కూడా షూట్ చేశారు. బప్పిలహరి మ్యూజిక్ డైరెక్టర్. అలా ఈ సినిమా మధ్యలో ఆగిపోయాక మళ్లీ చిరు, శ్రీదేవి కలిసి నటించరనే అందరూ అనుకున్నారు. అయితే వైజయంతీ అధినేత అశ్వనీదత్ వీరిని ఒప్పించి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా చేసి బ్లాక్‌బస్టర్ కొట్టారు.