టాలీవుడ్ లోని స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ఉంటారు. ఇద్దరూ తమ నటనతో ఓ రేంజ్ లో అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ఆయన పేరును నిలబెట్టారు. ఇక చిరు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు. నాలుగు దశాబ్దాల సినీ కెరీర్లో ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే బాక్సాఫీస్ దగ్గర పెద్ద యుద్ధంలానే ఉండేది.
చిరు – బాలయ్య మధ్య చాలా సార్లు బాక్సాఫీస్ ఫైట్ జరిగింది. ఇప్పటివరకూ వీరిద్దరి మధ్య ఏకంగా 31 సార్లు బాక్సాఫీస్ ఫైట్ జరిగింది. అయితే ఆ ఫైట్ లో ఎవరు ఎప్పుడు ? గెలిచారో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిసారి బాలయ్య – చిరు మధ్య 1984లో క్లాష్ జరిగింది. ఆ ఏడాది చిరంజీవి హీరోగా నటించిన ఛాలెంజ్ సినిమా విడుదల కాగా.. బాలయ్య జననీ జన్మభూమి అనే సినిమాతో వచ్చారు. మొదటి పోటీలో చిరు విన్నర్ గా నిలిచారు. రెండోసారి చిరు ఇంటిగుట్టు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. బాలయ్య మంగమ్మగారి మనవడు సినిమాతో బరిలోకి దిగారు. మంగమ్మగారి మనవడు బ్లాక్ బస్టర్ అవ్వడంతో బాలయ్య విన్ అయ్యాడు.
అదే ఏడాది చిరు అగ్నిగుండం సినిమాతో వచ్చాడు. బాలయ్య – ఎన్టీఆర్ కలిసి నటించిన వీరబ్రహ్మేంద్రస్వామి సినిమా వచ్చింది. ఈసారి కూడా బాలయ్య సినిమానే సూపర్ హిట్ గా నిలిచింది. ఐదోసారి బాలయ్య ఆత్మబలం, అదే రోజు చిరు నటించిన చట్టంతో పోరాటం సినిమా విడుదలైంది. ఈ రెండు సినిమాలు యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నాయి. అదే ఏడాది మరోసారి ఇద్దరూ పోటీలో దిగారు. చిరంజీవి దొంగ సినిమాతో రాగా బాలయ్య భార్యభర్తల బంధం సినిమాతో బాలయ్య వచ్చాడు. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి.
ఏడోసారి చిరు చిరంజీవి సినిమాతో బాలయ్య భలేతమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈపోటీలో ఇద్దరి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.ఆ తరవాత బాలయ్య కత్తుల కొండయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా చిరంజీవి విజేత సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టారు. ఆ తరవాత చిరంజీవి కొండవీటి రాజా సినిమాతో, బాలయ్య నిప్పులాంటి మనిషి సినిమాతో వచ్చారు. ఈ ఏడాదికూడా బాలయ్య పై చిరు గెలిచారు. పదోసారి బాలయ్య ముద్దులకృష్ణయ్య సినిమా, చిరంజీవి మగధీరుడు సినిమాతో వచ్చారు. ఈ పోటీలో బాలయ్య ముద్దుల కృష్ణయ్య సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో విజయం సాధించాడు.
ఆ తరవాత దేశోద్ధారకుడు సినిమాతో బాలయ్య రాగా చంటబ్బాయ్ సినిమాతో చిరు వచ్చాడు. ఈ యేడాది బాలయ్య గెలిచాడు. ఆ తరవాత ఏడాది బాలయ్య అపూర్వ సహోదరులు, చిరంజీవి రాక్షసుడు సినిమాలతో వచ్చారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ తరవాత చిరంజీవి దొంగమొగుడు సినిమాతో …బాలయ్య భార్గవరాముడు సినిమాతో బరిలోకి దిగారు. ఈ క్లాష్ లో భార్గవరాముడుతో బాలయ్య విజయం సాధించాడు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇక అదే ఏడాది చిరు చక్రవర్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా బాలయ్య మువ్వగోపాలుడుతో బరిలోకి దిగారు. చక్రవర్తికి యావరేజ్ టాక్ రాగా మువ్వగోపాలుడు సూపర్ హిట్ అయ్యింది.
ఆ తరవాత చిరు పసివాడి ప్రాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాలయ్య రాము సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా పసివాడి ప్రాణం రికార్డులు క్రియేట్ చేసింది. పదహారోసారి 1988లో చిరు మంచిదొంగ, బాలయ్య ఇన్స్పెక్టర్ ప్రతాప్ తో వచ్చారు. వీటిలో మంచిదొంగ సూపర్ హిట్ అయ్యింది. ఆ తరవాత చిరు యముడికి మొగుడు సినిమాతో రాగా బాలయ్య తిరగబడ్డ తెలుగుబిడ్డతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో యముడికి మొగుడు రికార్డులు క్రియేట్ చేసింది. ఆ తరవాత చిరు ఖైదీతో బరిలో దిగగా బాలయ్య భారతంలో బాలచంద్రుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాల్లో ఖైదీ నంబర్ 786 బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇరవయ్యో సారి చిరు యుద్దభూమితో ప్రేక్షకుల ముందుకు రాగా… బాలయ్య రాముడు భీముడుతో వచ్చాడు. వీటిలో బాలయ్య సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ తరవాత ఏడాది చిరు స్టేట్ రౌడీ సినిమాతో బరిలో నిలవగా బాలయ్య ముద్దుల మావయ్య సినిమాతో బాలయ్య వచ్చారు. వీటిలో బాలయ్య సినిమా రికార్డులు బద్దలు కొట్టింది. ఆ తరవాత చిరు రుద్రనేత్ర సినిమాతో బాలయ్య అశోకచక్రవర్తి సినిమాలతో రాగా రెండూ సినిమా బోల్తాకొట్టాయి. అదే ఏడాది బాలయ్య బాలగోపాలుడుతో రాగా చిరు లంకేశ్వరుడుతో వచ్చాడు. వీటిలో బాలయ్య బాలగోపాలుడు యావరేజ్ గా నిలిచింది.
మళ్లీ 1990లో వీరిద్దరి మధ్య పోటీ వచ్చింది. బాలయ్య నారీనారీ నడుమ మురారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చిరు జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాతో వచ్చారు. వీటిలో రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇరవై ఆరోసారి చాలా గ్యాప్ తరవాత 1997 బాలయ్య చిరు తలపడ్డారు. హిట్లర్ సినిమాతో చిరు పెద్దన్నయ్య సినిమాతో బాలయ్య ఇలా ఇద్దరూ అన్నయ్యలుగా వచ్చారు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఆ తరవాత చిరు బావగారూ బాగున్నారా సినిమాతో… బాలయ్య యువరత్న రాణాతో పోటీ పడ్డారు. వీటిలో బావగారు బాగున్నారా సూపర్ హిట్ గా నిలిచింది.
ఆ తరవాత చిరు స్నేహంకోసం సినిమాతో బాలయ్య సమరసింహారెడ్డితో వచ్చారు. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. అయితే సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్. ఆ తరవాత చిరు అన్నయ్య సినిమాతో బాలయ్య వంశోద్దారకుడు తో వచ్చారు. చిరు నటించిన అన్నయ్య బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2001లో చిరు మృగరాజు సినిమాతో రాగా బాలయ్య నరసింహనాయుడు సినిమా వచ్చింది. నరసింహనాయుడు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఆ తరవాత చిరు అంజి సినిమాతో రాగా బాలయ్య లక్ష్మీనరసింహాతో బరిలో దిగారు. వీటిలో బాలయ్య లక్ష్మీనరసింహ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక చివరిగా బాలయ్య చిరు 2017లో పోటీపడ్డారు. చిరు ఖైదీ నంబర్ 150తో రాగా బాలయ్య గౌతమిపుత్రశాతకర్ణితో వచ్చారు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. అయితే వచ్చే సంక్రాతికి వీరిద్దరు వీర సింహా రెడ్డి-వాల్తేరు వీరయ్య లతో 32 వ సారి పోటీ పడుతున్నారు. మరి చూడాలి ఈసారి ఎవ్వరు విన్ అవుతారో..?