తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణంతో మహేష్ బాబు విషాదంలో మునిగిపోయాడు. కేవలం రెండు నెలల తేడాలో అటు తల్లి ఇందిరా దేవిని.. ఇటు తండ్రి కృష్ణను కోల్పోవటం మహేష్ బాబును తీవ్ర విషాదంలోకి నెట్టేసిందనే చెప్పాలి. మహేష్ సినిమా షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు టైం కేటాయిస్తూ ఉంటాడు. అలాంటిది ఇప్పుడు తల్లి, తండ్రి ఇద్దరు లేకపోవడంతో కాస్త మూడ్ ఆఫ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయ్యి ఆరు నెలలు అవుతోంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పట్టాలు ఎక్కాల్సిన సినిమా రకరకాల కారణాలతో ఆలస్యం అవుతూ వస్తోంది. హారిక హాసిని బ్యానర్ పై చినబాబు నిర్మించే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే త్రివిక్రమ్ రెడీ చేసిన కథ మహేష్ కు నచ్చకపోవడంతో చాలా మార్పులు చేర్పులు చేశారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ముందు అనుకున్న కథను మార్చి మరో కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు వదిన పాత్రకు ఒకప్పటి హీరోయిన్ శోభనను త్రివిక్రమ్ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. శోభన 1990వ దశకంలో టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగింది. స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు సరసన ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. శోభన అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ట్రెడిషనల్ క్యారెక్టర్లే. రౌడీ అల్లుడు సినిమాలో చిరంజీవికి జోడిగా, అల్లుడుగారు, రౌడీ గారి పెళ్ళాం సినిమాల్లో మోహన్ బాబు పక్కన.. నారీ నారీ నడుమ మురారి సినిమాలో బాలయ్యకు మరదలుగా నటించింది.
మలయాళీ ముద్దుగుమ్మ అయిన శోభన సినిమాలకు దూరమై భరతనాట్య శిక్షణలో ఎంతోమంది శిష్యురాళ్లకు తర్పీదు ఇచ్చింది. తెలుగులో చాలా రోజుల తర్వాత మోహన్ బాబు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్- మహేష్ సినిమాతో మళ్ళీ రీఎంట్రీ కి రెడీ అవుతోంది. త్రివిక్రమ్ సినిమాల్లో సహజంగానే సీనియర్ హీరోయిన్లకు తీసుకోవటం కామన్ గా మారింది.
అత్తారింటికి దారేది సినిమాలో నదియా, అజ్ఞాతవాసి సినిమాలో కుష్బూ, అలావైకుంఠపురంలో సినిమాలో టబు ఉన్నారు. మరి ఆ సెంటిమెంట్ ప్రకారమే త్రివిక్రమ్ శోభనను తీసుకుంటున్నారా ? ఈ సెంటిమెంట్ మహేష్ సినిమాకు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. అతడు, ఖలేజా తర్వాత దాదాపు 12 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం మహేష్ బాబు- త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తోంది.