ఎన్టీఆర్-సావిత్రి జంటగా నటించిన అనేక సినిమాల్లో `అప్పుచేసి పప్పుకూడు` సినిమా సూపర్ హిట్. ఇక, ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు. ఒకరేమో ఎన్.టి.ఆర్.గా ఖాయమైపోయింది. రెండో హీరోగా అక్కినేని నాగేశ్వరరావు. అయితే, ఈ విషయం ముందు చెప్పలేదు. కథ రెడీ చేసుకుని అక్కినేనికి కబురు పెట్టారు.
ఎందుకంటే ఈ ఇద్దరు హీరోలకు అంత క్రేజీ కాంబినేషన్ అన్న పేరుంది.
ఎన్టీఆర్, అక్కినేనిల కాంబినేషన్‌తో సినిమా బాగా ఆడుతుందని, ట్రేడ్ వర్గాల్లోనూ దుమ్మురేపుతుందని ఆలోచించే ఆయనకు కబురు పెట్టారు. కానీ అక్కినేనికి ‘భూకైలాస్’ తాలూకు చేదు అనుభవాలు మనసులో గిరికీలు కొడుతున్నాయి. దీంతో ‘‘నేను జంట హీరోగా చేయదల్చుకోలేదు. బ్రదర్‌తో ఒకటి చేయండి. విడిగా నేనొక సినిమా మీకు చేస్తాను’’ అని తప్పించుకున్నారు. దీంతో ఆ రెండో పాత్రకు కొంగర జగ్గయ్యకు తీసుకున్నారు.
అప్పటి సీనియర్ ప్రతినాయకుడు సీఎస్ ఆర్‌కు బుద్ధి చెప్పడానికి అన్నట్టుగా .. ఆనాటి భారీ తారాగణాన్నంతా యీ చిత్రంలోకి దిగుమతి చేశారు. మంది ఎక్కువయితే మజ్జిగ పల్చనవుతుంద న్నట్లు పాత్రలు ఎక్కువ కావడంతో ఎవరికీ చిత్రంలో విశిష్ట స్థానం లేక పోయింది. ఒక సి.ఎస్.ఆర్.కు తప్ప! ఈ తారల సందడిలో ఎన్.టి.ఆర్. ఎలాగో తన ఉనికి కాపాడుకోగలిగారు.
ఆయనకు ఇందులో మూడు పేర్లు, మూడు వేషాలు. బాగా చదువుకున్న సంస్కారి రాజు, బొంకుల మర్రి రాజా వారు, సర్వభక్షక స్వాముల వారిగా చాలా బాగా నటించారు. ‘కడన్ వాంగి కల్యాణం’ పేరుతో తమిళంలో కూడా విడుదలైన యీ చిత్రంలో ఎన్.టి.ఆర్. పాత్రను జెమినీ గణేశన్ వేశారు. తెలుగులోనూ తమిళంలోనూ కూడా ఈ సినిమా భారీ హిట్స్ కొట్టింది.