అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ఏకంగా 5 నిమిషాలకు పైగా ఉన్న ప్రోమోలో ఆద్యంతం బాబు, బాలయ్య, లోకేష్ మధ్య ఆసక్తికరంగా సాగింది. చంద్రబాబుకు ముందు బాలయ్య ఘనంగా స్వాగతం పలుకుతూ స్టేజ్ మీదకు ఆహ్వానించారు. ఎన్టీఆర్ గురించి చెపుతూ నా లైఫ్‌లో ఆయన ఒక ఆరాధ్య దైవం… ఆయన ఎప్పుడూ నా గుండెల్లో ఉంటాడు అని చంద్రబాబు చెప్పారు. అలాగే తన కెరీర్లో తీసుకున్న బిగ్ డెసిషన్లలో 1995 ఆగస్టు సంక్షోభంగా చంద్రబాబు చెప్పారు.
అయితే అది మనం తీసుకున్న నిర్ణయం అంటూ బాలయ్యకు కూడా తెలుసు అన్నట్టుగా చెప్పారు. ఇక లోకేష్ స్విమ్మింగ్ పూల్‌లో అమ్మాయిలతో జలకాలాటలు ఫొటో చూపిస్తూ ఇది అసెంబ్లీ దాకా వెళ్లిందయ్యా ? అంటూ చమత్కరించారు. ఇక బాబు భార్య భువనేశ్వరికి అక్కడికక్కడే ఫోన్ చేయించిన బాలయ్య ఏమని పిలుస్తారు ? బావా అంటే ఊ అని పిలుస్తాను అని బాబు అనగా మీరు మా అందరి సాక్షిగా మా చెల్లాయికి ఐ లవ్ యూ చెప్పాలని కండీషన్ పెట్టారు.
వెంటనే బాబు భువనేశ్వరికి ఫోన్ చేసి మీ బాలకృష్ణ గారి చేతిలో ఇరుక్కుపోయాను అన్న వెంటనే భువనేశ్వరి పకపకా నవ్వేశారు. ఇక లోకేష్‌కు కూడా మంగళగిరిలో ఓడిపోగా ప్రజా ప్రతినిధిగా చట్టసభలకు వెళ్లాలనుకుని ఓడిపోయావని ప్రశ్నించగా.. లోకేష్ తాను ఓ సంకల్పంతో పోటీ చేశానని చెప్పారు. ఇక తానే వంట చేసుకోను.. మీ చెల్లికి ఏం చేసి పెడతానని కూడా చంద్రబాబు అన్నారు.
వెంటనే లోకేష్ హోస్ట్ ప్లేసులోకి రాగా… బాలయ్య అటు వైపు వెళ్లారు. బాబు, లోకేష్ కలిసి బాలయ్యను ఆడుకునే ప్రయత్నం చేస్తుండగా.. తండ్రి, కొడుకులు ఇద్దరూ కలిసి నా సంసారంలో నిప్పులు పోస్తారా ? అని బాలయ్య నవ్వుతూ అనేశారు. ఏదేమైనా ప్రోమోతోనే బాలయ్య దుమ్ము రేపేశాడు. మరి ఫైనల్‌గా ఎపిసోడ్లో ఇంకెన్ని ఇంట్రస్టింగ్ విషయాలు బయటకు వస్తాయో ? చూడాలి.