తెలుగు సినీ రంగంలో అన్నగారు ఎన్టీఆర్ చేయని ప్రయోగం అంటూ ఏదీ లేదు. అనేక రూపాలు వేశారు. అనేక పాత్రలు ధరించారు. దర్శకుడిగా.. నటుడిగా.. కథకుడిగా.. ఆయన విశ్వరూపం ఆమూలాగ్రం 70 ఎం.ఎం. తెరపై విస్తరించింది. అయితే.. అన్నగారు ఒక లక్ష్యం పెట్టుకున్నారట. తన కుమారులతో (బాలయ్య-హరికృష్ణ) మాయాబజార్ సినిమాను రీమేక్ చేయాలని భావించారట. తను నటించిన మాయాబజార్ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. బ్లాక్ అండ్ వైట్ మూవీ సామ్రాజ్యాన్ని కుదిపేసింది.
భారీ సక్సెస్ రేటును దక్కించుకున్న మాయాబజార్‌ను సినిమాలా కాకుండా.. ఒక కళాఖండంగా మలచడంలో కేవీ రెడ్డి ఎంతో కష్టపడ్డారు. దీనికి పనిచేసిన.. ప్రతి ఒక్కరూ.. ఎంతో తపనతో పనిచేశారు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి.. అన్నగారు.. రేలంగి, ఎస్వీ రంగారావు.. ఇలా.. అనేక మంది మనకు ఈ సినిమాలో పరిచయం అవుతారు. ఆ సినిమా.. విజయవాడ, మద్రాస్‌లలో రెండేళ్ల పాటు నిర్విరామంగా ఆడింది. ఇంత సూపర్ హిట్ కొట్టిన సినిమా.. అప్పట్లో లేదనే టాక్ ఉండేది. అందుకే.. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.
ఈ సినిమాను అన్నగారు.. రీమేక్ చేయాలని అనుకున్నారు. అర్జనుడిగా.. కృష్ణుడిగా.. బాలయ్య, హరికృష్ణలను పెట్టి.. ఈ సినిమాకు ప్లాన్ చేసుకున్నారు. ఇందులో శశిరేఖగా.. అప్పటికే హిందీ బెల్ట్‌లోకి వెళ్తున్న ఆలిండియా నెంబర్ 1 హీరోయిన్ శ్రీదేవిని పరిచయం చేయాలని.. అప్పటికి వర్ధమాన హీరోయిన్లు గా ఉన్నవారిని ప్రధాన పాత్రల్లోకి తీసుకుని.. తాను డైరెక్ట్ చేయాలని.. అనుకున్నారట అన్నగారు. అయితే.. అప్పటికే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు.. చర్చలు మాత్రం సాగుతున్నాయి.
కానీ, ఇంతలోనే అన్నగారు అమెరికాకు వెళ్లడం.. తర్వాత.. రాజకీయ సంక్షోభం.. కారణంగా.. రెండేళ్లపాటు..దీనిపై శ్రద్ధ చూపలేక పోయారు. తర్వాత.. మళ్లీ ఎన్నికలు.. ఇలా.. అన్నగారు అనుకున్న మాయాబజార్ రీమేక్ చేయాలని అనుకున్న సంగతి తర్వాత మరిచిపోయారు. ఈ విషయం.. అలానే ఉండిపోయింది. అన్నగారి జీవితంలో.. మైలు రాయి వంటి సినిమా అయినా.. మాయాబజార్‌ను తిరిగి నిర్మించలేకపోవడం.. పెద్దలోటుగా పేర్కొంటారు. ఈ సినిమాను తమ సొంత బేనర్.. రామకృష్ణా సినీ స్టూడియోపైనే తీయాలని అనుకోవడం మరో విశేషం.