సాక్షి.. సినిమాతో తెరంగేట్రం చేసిన రంగారావుకు అన్నగారంటే మహాప్రాణం. గతంలో స్టేజ్ ప్రోగ్రాంలు వేసేప్పుడు.. రావణాసురుడు.. పాత్రను రంగారావు చేసేవారట. అయితే ఈక్రమంలో ప్రేక్షకులను మెప్పిం చేందుకు అచ్చం అన్నగారిలాగానే నటించేవారట. ఇది తెలిసి ఆయన సినీరంగానికి రాగానే చాలా మంది అత్యంత తేలికగా పరిచయం అయ్యారు. ఇక, అన్నగారితోనూ సాక్షి రంగారావుకు పరిచయం అయింది. అప్పుడప్పుడే.. ఎదుగుతున్న రంగారావు ఓ రోజు అనుకోకుండా కృష్ణతో కలిసి అన్నగారిని కలిశారు.
ఈ సమయంలో రంగారావుగారు.. అని అన్నగారు సంబోధించారు. నిజానికి.. అప్పటికే అన్నగారి విషయం లో ఒక ర్యూమర్ ఉంది. ఎవరినైనా ఆయన `గారు` పిలిస్తే.. దూరం పెట్టేస్తున్నారని అర్థమట. ఇలా పిలి స్తే.. చాలా మంది అన్నగారికి దూరమైపోయినట్టుగా భావిస్తారట. దీంతో సాక్షిరంగారావుకు కూడా ఇదే బెంగ పట్టుకుంది. ఇప్పుడే పరిచయమయ్యా.. అప్పుడే దూరం పెట్టేస్తున్నారే! అని తెగ బాధపడి పోయారట.
అయితే.. అన్నగారు ఆయనను పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకుని.. ప్రేమగా మాట్లాడారట. ఎక్కడివారు.. ఇప్పటి వరకు ఏం చేశారు. మీరు చాలా అవసరం.. తెలుగు ఉచ్ఛారణ స్పష్టంగా ఉంది. అంటూ.. అన్నగారు కొనియాడారట. తర్వాత.. తన సినిమాల్లో చిన్న చిన్న కారక్టర్లకు ఆయనను సిఫారసు చేశారట. అయితే.. అన్నగారితో అతితక్కువ సమయమే.. సాక్షి రంగారావు తెర పంచుకున్నారు.
ఇది ఆయనలో మిగిలిపోయిన అసంతృప్తి. ఇక అన్నగారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. తెలుగు భాషాభివృద్ధి మండలికి సాక్షిని చైర్మన్‌ను చేయాలని అనుకున్నా.. రాజకీయ కారణాలతో చేయలే కపోయారట. ఇది.. తనకి లోటని.. సాక్షి పలుమార్లు చెప్పుకొన్నారు.