నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ వీర సింహారెడ్డి. క్రాక్ లాంటి బ్లాక్బస్టర్ తర్వాత మలినేని గోపీచంద్, అఖండ సూపర్ హిట్ తర్వాత బాలయ్య కలిసి చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై లెక్కకు మిక్కిలిగా అంచనాలు ఉన్నాయి. శృతీహాసన్ బాలయ్యకు జోడీగా నటిస్తుండగా… వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భీకర ఫామ్‌లో ఉన్న థమన్ సినిమాకు స్వరాలు అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గత ఆరేడు నెలలుగా ఎన్బీకే 107 టైటిల్‌తో పాపులర్ అవుతూ వచ్చిన ఈ సినిమా టైటిల్ గత రాత్రి కర్నూలులో జరిగిన ఈవెంట్‌లో అట్టహాసంగా రిలీజ్ చేశారు. ముందు నుంచి టైటిల్‌పై వచ్చిన రూమర్లకు తెరదించేశారు. జై బాలయ్యా – రెడ్డి గారు అన్న టైటిల్స్ బయటకు రాగా ఇప్పుడు వీర సింహారెడ్డి టైటిల్ పెట్టారు.
బాలయ్యకు కలిసొచ్చిన సింహా పేరు ఉండడంతో సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని బాలయ్య ఫ్యాన్స్ పిచ్చ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇక ఈ సినిమా డైరెక్టర్ మలినేని గోపీచంద్ స్వస్థలం ఒంగోలు. బాలయ్య సమరసింహారెడ్డి సినిమా చూసేందుకు టిక్కెట్ల కోసం బ్లాక్‌లో ట్రై చేసి ఓ రోజు జైళ్లో కూడా ఉండి వచ్చాడు. అంత వీరాభిమాని. ఇప్పుడు తన అభిమాన హీరోనే డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో గోపీచంద్ చాలా కేర్ తీసుకుని మరీ సినిమాను తీసినట్టు తెలుస్తోంది.
ఇక సినిమాలో పవర్ ఫుల్ డైలాగులకు కొదవలేదని అంటున్నారు. వీరసింహా రెడ్డి పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూల్ అంటూ బాలయ్య చెప్పే డైలాగులు ఎన్నో ఉన్నాయట. బుర్రా సాయిమాధవ్ బాలయ్య సినిమాలకు డైలాగులు చాలా పవర్ ఫుల్‌గా ఉండేలా చూసుకుంటారు. ఇప్పుడు వీర సింహారెడ్డికి కూడా అంతే పవర్ ఫుల్‌గా రాశాడంటున్నారు.
పైగా బాలయ్యకు కలిసి వచ్చిన సంక్రాంతి సెంటిమెంట్, సింహా, రెడ్డి అన్న పదం కూడా టైటిల్లో ఉండడంతో ఖచ్చితంగా మరో సంక్రాంతి హిట్ ఈ సినిమా అంటున్నారు. సినిమాలో డ్యాన్సులు, ఫైట్లు, డైలాగులు, సెంటిమెంట్ బాగా వచ్చిందంటున్నారు.