ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఉంటుందని చెప్పాడు మోహన్ బాబు దర్శకుడు..? మోహన్ బాబు దర్శకుడంటే చాలామంది ఉన్నారు. ఆయన నిర్మాణ సంస్థలో చిత్రాలు తీసి హిట్ కొట్టినవారెందరో ఉన్నారు. వారిలో అగ్ర దర్శకులు కే రాఘవేంద్ర రావు లాంటి వారూ ఉన్నారు. అలాగే, ఇటీవల కాలంలో అడపాదడపా సినిమాలు చేస్తున్న డైమండ్ రత్నబాబు లాంటి వారూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మోహన్ బాబు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉంటున్న డైమండ్ రత్నబాబు..సన్నాఫ్ ఇండియా అనే సినిమాను మోహన్ బాబుతో తీసిన సంగతి తెలిసిందే.
అంతకముందు ఆది సాయి కుమార్‌తో బుర్రకథ అనే సినిమాను తెరకెక్కించారు రత్నబాబు. రచయితగా ఇండస్ట్రీలోకి అడుగుపెటిన రత్నబాబు..తనకి తానుగా ఓ ఐడెంటిటీ కావాలంటే ఏదో కొత్తగా వినిపించే పేరు పెట్టుకోవాలని ఆలోచించి అందులోనుంచి వచ్చిన ఐడియాని ఇంప్లిమెంట్ చేశాడు. అలా తన పేరుకు ముందు డైమండ్ అని తగిలించుకున్నారు. డైమండ్ రత్నబాబు అంటే వీడెవడో కాస్త ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు..అని కాసేపు మాట్లాడే సమయం ఇస్తారనేది ఆయన ఉద్దేశ్యం.
అది వర్కౌట్ అయింది. బాగానే పరిచయాలు పెరిగాయి. ముఖ్యంగా మంచు ఫ్యామిలీకి బాగా దగ్గరయ్యారు. బయట వ్యక్తులు ఎవరైనా వచ్చి మంచు హీరోలతో సినిమా చేయాలంటే కథ ముందు రత్నబాబు వినాలని మంచు హీరోలు చెబుతారట. ఇది ఎంతవరకూ నిజమో తెలీదు గానీ..దీని గురించి మాత్రం ఇండస్ట్రీలో రక రకాలుగా చెప్పుకుంటున్నారు. ఇక మోహన్ బాబుతో తీసిన సన్నాఫ్ ఇండియా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఓటీటీకోసం తీసిన సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేశారు.
మోహన్ బాబు కెరీర్లోనే భారీ డిజాస్టర్. దీని ప్రభావం వల్ల ఇక డైమండ్ రత్నబాబు ఇక ఇండస్ట్రీలో కనిపించరని చెప్పుకున్నారు. కానీ, ఇప్పుడు అన్‌స్టాపబుల్ అనే కామెడీ ఎంటర్టైనర్ను తీస్తున్నారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కమిట్మెంట్ మీద రియాక్ట్ అయిన రత్నబాబు నేను హీరోయిన్స్‌ను కమిట్మెంట్ అడుగుతానని చెప్పి షాకిచ్చాడు.
అయితే, అది సినిమా వర్క్ విషయంలో తప్ప అందరూ అనుకునే ఆ కమిట్మెంట్ విషయంలో కాదని…నా సినిమాకి పనిచేసే ఎవరైనా కమిట్మెంట్తోనే రావాలని చెప్పుకొచ్చారు. ఇక ఇండస్ట్రీలో ఈ కమిట్మెంట్ అనేది వారి వారి ఇష్టానికి తగ్గట్టు ఉంటుందే తప్ప ఎవరూ ఎవరినీ బలవంతం చేయరని..ఉన్న మాట వాస్తవం అని తెలిపారు.