కన్నడ దర్శకుడు రిషిబ్ శెట్టి ఇప్పుడు కాంతారా మూవీతో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా మూడు వారాల క్రిందట ఓ కన్నడ సినిమాగా రిలీజ్ అయిన కాంతారా ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే రు. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా తెలుగులోనూ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేసింది. తెలుగులోనే ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా వసూళ్లు కొల్లగొడుతోంది. గత శనివారం టాలీవుడ్‌లో రిలీజ్ అయిన కాంతారా ఇప్పటికే రు. 22 కోట్లను మించిన వసూళ్లు రాబట్టింది.
విచిత్రం ఏంటంటే కాంతారా తెలుగుతో పాటు అటు హిందీలోనూ ఇటూ తమిళంలోనూ అంతే రికార్డులు క్రియేట్ చేస్తూ సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఉన్న సినీ సెలబ్రిటీలు అందరూ ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు రిషిబ్ గురించే ఆరా తీస్తున్నారు. ఇక నెటిజన్లు కూడా రిషిబ్ గురించి గూగుల్లో తెగ సెర్చ్ చేస్తూ అతడి విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
రిషబ్ శెట్టి రష్మిక హీరోయిన్‌గా పరిచయం అయిన కిరిక్ పార్టీకి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత నటుడిగా గరుడ గమన వృషభ వాహన సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. అయితే తాజా సినిమాతో అసలు కనీ వినీ ఎరుగని రీతిలో ఊహించని సక్సెస్ కొట్టాడు. ఇక రిషిబ్ శెట్టి లవ్ స్టోరీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిషిబ్‌ది ప్రేమ వివాహం.. భార్య పేరు ప్రగతి శెట్టి.
2016లో వీరి మధ్య పరిచయం విచిత్రంగా జరిగింది. ఓ కన్నడ సినిమా ఈవెంట్ సాక్షిగా ఈ పరిచయం జరిగింది. రిషిబ్ హీరో రక్షిత్ శెట్టితో ఓ సినిమా చేశాడు. తనకు వీరాభిమానిగా ఉన్న ప్రగతి ఆ సినిమా ఈవెంట్లోనే రిషబ్‌కు పరిచయం కావడం.. తర్వాత వీరు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ కావడం జరిగిందట. ముందుగా ప్రగతియే రిషబ్‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిందట. ఆ తర్వాత ఇద్దరి మధ్య చాటింగ్‌లు మొదలయ్యాయి.
ఆ తర్వాత ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. ప్రేమలో పడ్డారు.. టీ పార్టీలతో ప్రేమ మొదలైంది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే ప్రగతి శెట్టి వాళ్ల ఫ్యామిలీకి రిషబ్ శెట్టితో పాటు సినిమా కెరీర్ నచ్చలేదట. సినిమా రంగంలో ఉన్నవాళ్లకు తమ కుమార్తెను ఇచ్చేందుకు వాళ్లు ఒప్పుకోలేదట. అయితే ప్రగతి తాను రిషబ్‌ను తప్పా ఎవ్వరిని పెళ్లి చేసుకోనని ఇంట్లో వాళ్లపై ఒత్తిడి చేయడంతో చివరకు 2020లో వీరి పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఓ కుమారుడున్నాడు.