సినీమాల్లో తనదైన శైలిలో దూసుకుపోయిన అన్నగారు ఎన్టీఆర్.. తెరమీద అందరినీ అలరించిన విష యం తెలిసిందే. ఆయన అనేక పాత్రలు పోషించారు. ఏ పాత్ర పోషించినా..దానిలో ఆయన జీవించారు. అదేవిధంగా.. నిజ జీవితంలోనూ అనేక కట్టుబాట్లు.. క్రమశిక్షణను అన్నగారు అలవరుచుకున్నారు. ముఖ్యంగా ఆర్థిక క్రమ శిక్షణ విషయంలో అన్నగారికి తిరుగులేదు. ఆయన ప్రతి రూపాయినీ చాలా పొదుపుగా ఖర్చు పెట్టేవారు.
కేవలం ఆయనే కాదు.. ఆయనతో స్నేహం చేసిన.. వారికి కూడా.. అదే చెప్పేవారు. ఇలాంటి వారిలో తర్వాతి తరం హీరో మాగంటి మురళీ మోహన్. చెన్నైలో ఈయన కూడా.. కష్టపడి పైకి వచ్చారు. సైకిల్ పైస్టూడియోలకు వెళ్లిన ఒకరిద్దరు తెలుగు హీరోల్లో.. మురళీ మోహన్ కూడా ఉన్నారు. సాయంత్రం షూటింగ్ అయిపోగానే.. అన్నగారితో కలిసేందుకు ఇష్టపడేవారట. ఈ సమయంలో అన్నగారు చెప్పే ఆర్థికసూత్రాలు.. తన జీవితంలో అనేక మార్పులు.. మలుపులు తీసుకు వచ్చాయని అంటారు.
“నన్నునేను మలుచుకునేందుకు అన్నగారి ఆర్థిక సూత్రాలు.. నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఆర్థిక మంత్రం ఎక్కడో లేదని.. అన్నగారు అంటారు. మనం సంపాయించేది తక్కువైనా.. ఎక్కువైనా.. ఒక క్రమ శిక్షణను అలవరుచుకోవాలనేది అన్నగారి సిద్ధాంతం. దీనికి తగిన విధంగానే.. ఆయన జీవించారు. ఆయనను అనుసరించినవారు కూడా.. అంతే ఉన్నతిలో ఉన్నారు.“ అని మురళీ మోహన్‌వివరిస్తారు.
అన్నగారి బాటలో నడిచిన శోభన్‌బాబు, మురళీమోహన్, గిరిబాబు.. వంటి అతి తక్కువ మంది నటులు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కొనలేదని.. మురళీ మోహన్ వెల్లడిస్తారు. తను రూపాయి రూపాయి పొదుపు చేసి.. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఉన్నానని అంటారాయన. ఇదీ.. అన్నగారి ఆర్థిక మంత్రం.